రామ్ చరణ్‌ అన్నతో సినిమా చేయాలని ఉంది: వరుణ్ తేజ్

Varun Tej expresses desire to act with Ram Charan
  • చరణ్ అన్నయ్యతో కలిసి నటించాలని ఉందని చెప్పిన వరుణ్ తేజ్
  • 'కొరియన్ కనకరాజు' హిట్‌తో ఐదేళ్ల నిరీక్షణ ఫలించిందన్న మెగా హీరో
  • 'గని'లా కాకుండా 'బరి' పక్కా స్పోర్ట్స్ డ్రామాగా ఉంటుందని వెల్లడి
  • కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్
  • భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచన ఉందన్న వరుణ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన సోదరుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి వెండితెరను పంచుకోవాలన్న తన ఆకాంక్షను వెల్లడించారు. ఇటీవల 'కొరియన్ కనకరాజు' చిత్రంతో విజయాన్ని అందుకున్న ఆయన, ఆ సంతోషాన్ని పంచుకుంటూ తన కెరీర్, భవిష్యత్ ప్రాజెక్టులకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

గత ఐదేళ్లుగా ఆశించిన స్థాయిలో విజయాలు లేకపోవడంతో కొంత ఒత్తిడికి లోనయ్యానని, అయితే 'కొరియన్ కనకరాజు' చిత్రానికి ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణతో ఇప్పుడు ఎంతో ఊరటగా ఉందని వరుణ్ పేర్కొన్నారు. కేవలం ఒకే తరహా జోనర్‌లకు పరిమితం కావడం తనకు ఇష్టం ఉండదని, నటుడన్నవాడు ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయాలని తాను నమ్ముతానని చెప్పారు. కరోనా అనంతర కాలంలో ఓటీటీ ప్రాధాన్యత పెరిగినప్పటికీ, థియేటర్‌లకు వచ్చే ప్రేక్షకులకు ఒత్తిడిని దూరం చేసేలా స్వచ్ఛమైన వినోదాన్ని అందించడం ఎంతో కీలకమని తాను గ్రహించినట్లు వివరించారు.

త్వరలో విడుదల కానున్న స్పోర్ట్స్ డ్రామా 'బరి' గురించి ప్రస్తావిస్తూ, గతంలో తాను చేసిన 'గని' చిత్రంలో అనేక అంశాలను జోడించడం వల్ల కొంత గందరగోళం ఏర్పడిందని, అయితే 'బరి' మాత్రం పూర్తి క్రీడా నేపథ్యంతో ఎంతో వాస్తవికంగా ఉంటుందని వరుణ్ తేజ్ భరోసా ఇచ్చారు. ఈ చిత్ర ఆలోచన తన సోదరి నిహారిక నుంచి వచ్చిందని తెలిపారు. దీనితో పాటు, ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ చిత్రానికి అంగీకరించానని, తన వయసుకు తగినట్లుగా ఉండే ఈ ప్రేమకథ విభిన్న శైలిలో ఉంటుందని వెల్లడించారు.

రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ, "చరణ్ అన్నయ్య అగ్ర కథానాయకుడు. తన సినిమాల కోసం ఆయన పడే శ్రమను చూసి నేను ఎంతో స్ఫూర్తి పొందుతుంటాను. చరణ్ అన్నతో కలిసి ఒక సినిమా చేయాలన్నది నా కోరిక" అని తన మనసులోని మాటను బయటపెట్టారు. తాను చిత్ర పరిశ్రమలోకి దర్శకుడు కావాలనే లక్ష్యంతో అడుగుపెట్టానని, భవిష్యత్తులో ఆ దిశగా తప్పకుండా అడుగులు వేస్తానని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు.
Advertisement
Varun Tej
Ram Charan
Korean Kanakaraju
Bari Movie
Karthik Subbaraj
Mega Family

More Telugu News