మా నాన్నను చివరి సారి చూస్తాను... రక్షణ కావాలని పోలీసులను కోరిన అమృత!
- నిన్న హైదరాబాద్ లో మారుతీరావు ఆత్మహత్య
- అమృత వచ్చేందుకు అంగీకరించని బాబాయ్
- అంత్యక్రియలకు వస్తానంటున్న అమృత
తన తండ్రి అంత్యక్రియలకు వస్తానని అమృత చేసిన విజ్ఞప్తిపై ఇప్పటివరకూ ఆమె తల్లి స్పందించలేదని తెలుస్తోంది. తన కుటుంబం ఇలా కావడానికి కారణం అమృతేనన్న ఆగ్రహంతో ఆమె ఉన్నట్టు కొందరు బంధువులు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో అమృత వచ్చేందుకు ఆమె బాబాయ్ నిరాకరించాడని సమాచారం. ఆమె వస్తే, తన సోదరుడి ఆత్మ శాంతించబోదని ఆయన అన్నట్టు తెలుస్తోంది.
కాగా, అమృత ప్రేమ వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో, ఆమె భర్త ప్రణయ్ ని 2018లో మారుతీ రావు దారుణంగా హత్య చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు, హైదరాబాద్ లోని, వైశ్య భవన్ లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడగా, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. ఆయన బస చేసిన గదిలో విషపు బాటిల్ కనిపించకపోవడంతోనే అనుమానాస్పద కేసుగా భావించి, విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. మారుతీరావు అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం జరుగనున్నాయి.