ఒక చాయ్ వాలా ప్రధాని కావడానికి నెహ్రూనే కారణం: శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు
- ఏ వ్యక్తి అయినా అత్యున్నత స్థానానికి చేరుకునేలా వ్యవస్థలను తీర్చిదిద్దింది నెహ్రూనే
- మంగళయాన్ గురించి కేంద్రం గొప్పగా చెప్పుకుంటోంది... ఇస్రోను స్థాపించింది ఎవరు?
- ఓ పద్ధతి ప్రకారం నెహ్రూపై అపనిందలను మోపుతున్నారు
తాను రచించిన 'నెహ్రూ: ది ఇన్వెన్షన్ ఆఫ్ ఇండియా' పుస్తకాన్ని ఢిల్లీలో విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని ఏ వ్యక్తి అయినా అత్యున్నత స్థానానికి చేరుకునే విధంగా వ్యవస్థలను నెహ్రూ తీర్చి దిద్దారని థరూర్ చెప్పారు. అంతులేని అబద్ధాలతో నెహ్రూకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో బీజేపీ వ్యతిరేక ప్రచారాన్ని కొనసాగిస్తోందని ఈ సందర్భంగా శశిథరూర్ మండిపడ్డారు.
దేశ ప్రథమ ప్రధానిపై ఓ పద్ధతి ప్రకారం అపనిందలను మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భరతమాత గొప్ప పుత్రుల్లో ఒకరైన నెహ్రూను కావాలని కించపరుస్తున్నారని... ఇలా ఎందుకు చేస్తున్నారని? ప్రశ్నించారు. ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం మంగళయాన్ గురించి గొప్పగా చెప్పుకుంటోందని... ఈ ఘనతను సాధించిన ఇస్రోను స్థాపించింది ఎవరని థరూర్ అడిగారు. పేద దేశమైన ఇండియా ఆకాశాన్ని లక్ష్యం చేసుకోవాలనే ధైర్యం చేసిందెవరని ప్రశ్నించారు. సిలికాన్ వ్యాలీకి 40 శాతం మంది నిపుణులను పంపిస్తున్న ఐఐటీలను స్థాపించిందెవరని అన్నారు.
ఈ కార్యక్రమానికి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నెహ్రూ మనకు అందించిన అతిగొప్ప వారసత్వాన్ని... ప్రస్తుత ప్రభుత్వం నిరంతరం అణగదొక్కేందుకు యత్నిస్తోందని విమర్శించారు. నవభారతాన్ని నెహ్రూ నిర్మించిన తీరును ప్రస్తుత ప్రభుత్వం తప్పుబడుతోందని... దేశాన్ని అధ్వానమైన దిశగా తీసుకెళుతోందని మండిపడ్డారు.