కౌన్ బనేగా కరోడ్‌పతిలో కోటి గెలుచుకున్న మహిళ విషాద గాథ ఇది!

  • 2003లో కిడ్నాప్‌కు గురైన భర్త
  • ఇప్పటి వరకు తిరిగి రాని వైనం
  • ట్యూషన్లు చెప్పుకుంటూ కుటుంబ భారాన్ని మోస్తున్న బినితా జైన్
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ టీవీ షోలో కోటి రూపాయలు గెలుచుకున్న అసోంకు చెందిన బినితా జైన్ తమ కుటుంబానికి చెందిన విషాదకరమైన విషయాన్ని బయటపెట్టారు. 2003లో బిజినెస్ ట్రిప్ కోసం వెళ్లిన తన భర్త తిరిగి రాలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత తన భర్తను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని తెలిసిందన్నారు.

అతడిని విడిపించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తన పిల్లలు మరీ చిన్నవారని బినిత వివరించింది. ఈ ఘటన జరిగిన ఏడాదిన్నర తర్వాత ఇక లాభం లేదని కుటుంబ బాధ్యతలు తనపై వేసుకున్నానని, ట్యూషన్లు చెప్పడం ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు.

సోషల్ స్టడీస్, ఇంగ్లిష్ బోధించే బినిత తొలుత ఏడుగురు విద్యార్థులతో ట్యూషన్లు ప్రారంభించారు. ప్రస్తుతం వారి సంఖ్య 125 మందికి చేరుకుంది. తన భర్త మృతి చెందినట్టు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించినా, ఆమె మాత్రం ఎక్కడో క్షేమంగా ఉండే ఉంటారని ఆశాభావంతో ఉన్నారు. ఆమె వ్యధ తెలిసి కేబీసీ హోస్ట్ అమితాబ్ బచ్చన్ కరిగిపోయారు.

షోలో కోటి రూపాయలు గెలుచుకున్న బినితా జైన్ ఏడు కోట్ల రూపాయల ప్రశ్నకు సిద్ధమవుతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఎవరికీ ఇటువంటి అవకాశం రాలేదు.
Go Back to Shorts
crorepati
Binita Jain
husband
abduct
terrorists

More Telugu News