నేను క్షేమంగానే ఉన్నా.. కంగారొద్దు!: హీరో నాని

  • జూబ్లీహిల్స్‌లో ప్రమాదానికి గురైన కారు
  • డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం
  • ట్వీట్ చేసిన నాని.. వారంలో తిరిగి షూటింగ్‌కు..
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో శుక్రవారం ఉదయం ప్రముఖ నటుడు నాని ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నాని స్వల్పంగా గాయపడ్డాడు. పెదవికి స్వల్పంగా గాయం అయింది. ఈ ఘటనపై నాని స్పందించాడు. తాను క్షేమంగానే ఉన్నానని, భయపడాల్సిన పని లేదని ట్వీట్ చేశాడు. అభిమానులు ఆందోళన చెందవద్దని, తనకు చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని  పేర్కొన్నాడు. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొంటానని తెలిపాడు.

శుక్రవారం ఉదయం నాని షూటింగ్ ముగించుకుని జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45 మీదుగా గచ్చిబౌలి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. నాని పెదవికి గాయం అయింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మరో కారు తెప్పించుకుని ఇంటికి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నాని డ్రైవర్‌కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. మద్యం సేవించలేదని తేల్చిన పోలీసులు నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Tollywood
Actor
Nani
Car
Accident
Hyderabad

More Telugu News