ఒకేసారి 2 లక్షల మందితో మాట్లాడనున్న కోవింద్... వినూత్న ప్రయోగానికి ఏపీ రెడీ!
- 27న ఏపీకి రానున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
- అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లో ఏర్పాట్లు
ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రపతి తనకు నచ్చిన గ్రామం, పట్టణం నుంచి ఎదురుగా స్క్రీన్ పై కనిపిస్తున్న వారితో మాట్లాడేలా ఏర్పాట్లు చేసిన చంద్రబాబు సర్కారు, ఒకేసారి 2 లక్షల మందిని ఆయనకు అందుబాటులోకి తేనుంది. ఇందుకు భారీ జెయింట్ స్క్రీన్ లను ఏర్పాటు చేయనుంది. ఏపీలోని అన్ని పట్టణాలు, మండలాలను ఒకేసారి చూపిస్తూ జరగనున్న ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.
సచివాలయంలోని సెంట్రల్ మీటింగ్ హాల్ వేదికగా, ఈ కార్యక్రమం సాగనుందని సమాచారం. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పరిపాలనను ఎంత సులభతరం చేసిందన్న విషయంతో పాటు, రాజధాని నుంచి ప్రతి గ్రామానికీ కనెక్టివిటీని ఎలా రూపొందించుకున్నామన్న విషయాన్ని కోవింద్ కు తెలియజెప్పడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగనుందని అధికారులు వెల్లడించారు.