బ్రహ్మానందం సాక్షిగా ఎమ్మెస్ నారాయణను భయపెట్టేశాను!: కమెడియన్ వేణుమాధవ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్రహ్మానందం సాక్షిగా ఎమ్మెస్ నారాయణను భయపెట్టేశాను!: కమెడియన్ వేణుమాధవ్

  • కొత్తగా కారు కొన్నాను 
  • ఫిల్మ్ సిటీలో షూటింగులో వున్నాం
  • ఎమ్మెస్ ను భయపెట్టాలని స్కెచ్ వేశా 
  • పక్కనే బ్రహ్నానందం కూడా వున్నాడు
తెలుగు తెరపై కామెడీని కదను తొక్కించిన హాస్యనటుల్లో వేణుమాధవ్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ఒక సరదా సంఘటనను గురించి ప్రస్తావించారు. " నేను కొత్తగా మారుతి కారు కొన్నాను .. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్. నేను .. బ్రహ్మానందం .. ఎమ్మెస్ నారాయణ కాంబినేషన్. ఎమ్మెస్ నారాయణను భయపెడదామనే ఉద్దేశంతో బ్రహ్మానందానికి కన్నుగీటి .. ఎమ్మెస్ తో 'అన్నా, నేను కొత్తగా కారుకొన్నాను .. ముందుగా నువ్ ఎక్కాలి' అన్నాను.

'బ్రహ్మం అన్న వున్నాడురా .. నేను ఒక్కడినే ఎక్కితే బాగుండదు .. ఆయనని కూడా పిలూ' అన్నాడు. సర్లే అని చెప్పేసి బ్రహ్మానందాన్ని వెనక సీట్లో కూర్చోమన్నాను. ఎమ్మెస్ .. ముందు సీట్లో కూర్చున్నాడు. ఫిల్మ్ సిటీ రోడ్లపై కారు నడపడం మొదలుపెట్టాను. కారు 100 మీద వెళుతుండగా .. కావాలనే పేవ్ మెంట్ మీదకి ఎక్కించాను. కారు ఏట వాలుగా దూసుకుపోతోంది. 'ఆపరా .. ఆపరా .. నేను చచ్చిపోతాను రా' అంటూ ఎమ్మెస్ అరుస్తున్నారు.

'అబ్బా .. ఆగన్నా' అంటూ నేను కార్లో అటూ ఇటూ ఏదో వెతుకుతున్నట్టుగా నటిస్తున్నాను. 'ఏంట్రా వెతుకుతున్నావ్' అన్నారాయన. 'ఇక్కడెక్కడో బ్రేక్ ఉండాలన్నా .. నీ దగ్గరేమైనా ఉందేమో చూడు' అన్నాను. దాంతో ఆయన భయపడిపోతూ 'నీకు డ్రైవింగ్ రాదా?' అని అడిగారు. 'నేర్చుకోవడం కోసమే నిన్ను ఎక్కుంచుకున్నానన్నా' అన్నాను. అప్పుడు చూడాలి ఎమ్మెస్ ఫేసు .. వెనకసీట్లో వున్న బ్రహ్మానందం అలా నవ్వుతూనే వున్నారు. ఇప్పటికీ ఈ విషయం తలచుకుని నవ్వుకుంటూనే ఉంటాం" అంటూ చెప్పుకొచ్చారు.     
venumadhav
brahmanandam

More Telugu News