ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన సిరీస్ లు రాజ్యం చేస్తున్నాయి. హారర్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ .. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథలు ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాయి. ఈ  నేపథ్యంలో సెక్స్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన కథ ఒకటి 'నెట్ ఫ్లిక్స్' తెరపైకి వచ్చింది. ఆ సిరీస్ పేరే 'సూపర్ సుబ్బు'. సందీప్ కిషన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్, ఈ నెల 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 

సుబ్రహ్మణ్యం (సందీప్ కిషన్) ను అంతా సుబ్బు అని పిలుస్తుంటారు.  తండ్రి .. తల్లి .. ఓ మేననమామ ఇదే అతని కుటుంబం. తండ్రి కుక్కుటేశ్వరరావు (మురళీ శర్మ) స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేసి రిటైర్ అవుతాడు. ఇక మేనమామ సునీల్ ( సంపూర్ణేశ్ బాబు) పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోతాడు. తాను పనిచేసిన స్కూల్లో ల్యాబ్ అసిస్టెంట్ గా సుబ్బుకి  టెంపరరీ పోస్ట్ వేయిస్తాడు కుక్కుటేశ్వరరావు.  టీనేజ్ లో ఉన్నప్పటి నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ పట్ల సుబ్బు ఆసక్తిని చూపించేవాడు. అందువలన అతని పట్ల తండ్రి ఒక రకమైన కోపాన్ని పెంచుకుంటాడు. 

ఒకానొక సందర్సభంలో సుబ్బు ల్యాబ్ అసిస్టెంట్ జాబ్ కూడా పోగోట్టుకునే పరిస్థితి వస్తుంది. దాంతో అతనికి సెక్స్ ఎడ్యుకేషన్ పట్ల ఆసక్తి ఉందనే విషయాన్ని ప్రిన్సిపాల్ మధుసూదనరావు (బ్రహ్మానందం)  గమనిస్తాడు. 'మాకీపూర్' అనే విలేజ్ కి సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించడానికి వెళ్లిన తన బావమరిది తన్నులు తినేసి తిరిగి రావడంతో, మధుసూదనరావు ఆ స్థానంలో సుబ్బును పంపిస్తాడు. అయితే తాను ఏ పనిపై వెళుతున్నది తండ్రికి చెప్పకూడదని సుబ్బు మాట తీసుకుంటాడు. 

దివ్య (మానస చౌదరి)తో సుబ్బుకి పెళ్లి కుదురుతుంది. ఆమెకి  నచ్చినట్టుగా ఉండటం కోసమే, అతను ఆ జాబ్ చేయడానికి అంగీకరిస్తాడు. 'మాకీపూర్' గ్రామస్తులు చాలా తేడా మనుషులనీ, వాళ్లకి లైంగిక విజ్ఞానంపై ఏ మాత్రం అవగాహనా లేదని తెలుసుకుంటాడు. వాళ్లలో మూఢనమ్మకాలు బలంగా ఉంటాయని వింటాడు. ఆ తరువాతనే అతను మాకీపూర్ వెళ్లి, తన  డిపార్టుమెంటుకి చెందిన 'కాంతారావు' (గెటప్ శ్రీను)ను కలుసుకుంటాడు.

'మాకీపూర్'కి సంబంధించినంత వరకూ గిరి - గంగాధర్ - కిషన్ అనే వ్యక్తులు చాలా ప్రమాదకరమైనవారని తెలుసుకుంటాడు. ఇక సర్పంచ్ తమ్ముడు రమేశ్ కూడా అదే కోవకి చెందినవాడనే విషయం సుబ్బుకి అర్థమవుతుంది. అక్కడే అతనికి స్వాతి (మిథిలా పాల్కర్) పరిచయమవుతుంది. హీరోయిన్ కావాలనే పట్టుదలతో ఉన్న ఆమె, రీల్స్ చేస్తూ ఉంటుంది. ఆ ఊళ్లో సుబ్బుకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని అతను ఎలా అధిగమిస్తాడు? అనేది కథ.

మారుమూల గ్రామాలలోని ప్రజలు సెక్స్ గురించి మాట్లాడటానికి ఇబ్బందిపడుతూ ఉంటారు. శానిటరీ ప్యాడ్ .. కండోమ్ గురించి మాట్లాడటాన్ని బూతుగా భావిస్తారు. ఆడపిల్లలు .. మగపిల్లలు ఎందుకు పుడతారనేది తెలియక, మగపిల్లల కోసం వరుస కాన్పులకు వెనుకాడకపోవడం కనిపిస్తుంది. ఫ్యామిలీ ప్లానింగ్ పట్ల అవగాహన లేని కారణంగా, పురుషులు తాము ఏదో కోల్పోయామనే ఆందోళనకి లోనవుతుంటారు. అలాంటి ఒక ఊరుకు సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా వెళ్లిన సుబ్బు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది ఈ కథలోని ప్రధానమైన అంశం.

టీనేజ్ నుంచి తన కొడుకు సెక్స్ పట్ల ఆసక్తిని కనబరుస్తూ ఉన్నాడని భావించిన సుబ్బు తండ్రి, కొడుకు పట్ల ఒక అసహ్యాన్ని పెంచుకుంటాడు. సుబ్బు మేనమామకు కూడా అతనిపై అలాంటి అభిప్రాయమే ఉంటుంది. ఈ కథలోకి తొలి అడుగులు వేస్తున్న ప్రేక్షకులు కూడా ముందుగా అదే ఆలోచనకి వస్తారు. కానీ అతను సెక్స్ కంటే కూడా ప్రేమకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాడనే  దిశగా ఆ పాత్రను నడిపించిన తీరు గొప్పగా అనిపిస్తుంది.

మారుమూల గ్రామీణ ప్రాంతాలలో సెక్స్ అనేది చాలా సున్నితమైన అంశంగా అనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడి మహిళల దగ్గర అందుకు సంబంధించిన ప్రస్తావన చేయడమే ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే తరతరాలుగా బలపడిన మూఢనమ్మకాలలోనే వాళ్లు బ్రతుకుతుంటారు. అలాంటి ఒక ఊర్లో .. అక్కడి ప్రజలలో లైంగిక సంబంధమైన విజ్ఞానాన్ని పెంపొందించడానికి కథానాయకుడు ఎంత రిస్క్ చేశాడనేది చూపించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. 

అయితే దర్శకుడు సుబ్బు పాత్రపై .. అతని తండ్రి పాత్రపై మాత్రమే పూర్తి దృష్టి పెట్టడం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెండు పాత్రలు మినహా మిగతా పాత్రలు తేలిపోతుంటాయి. సుబ్బుతో పెళ్లికి ఒప్పుకున్న 'దివ్య' పాత్ర .. విలేజ్ లో రీల్స్ చేసే 'స్వాతి' పాత్ర .. సర్పంచ్ తమ్ముడు కూతురు 'అలేఖ్య' పాత్రలను సరిగ్గా డిజైన్ చేయలేదు. దాంతో ఆ పాత్రల వైపు నుంచి ఆశించిన అవుట్ పుట్ రాలేదు.


కథలో లవ్ .. కామెడీ .. ఎమోషన్స్ ఉన్నాయి. కానీ వాటిని బలంగా ఆవిష్కరించలేకపోయారు. చాలా పాత్రలు తెరపైకి వస్తుంటాయి .. వెళుతుంటాయి. పేరున్న ఆర్టిస్టులే ఆ పాత్రలలో కనిపిస్తూ ఉంటారు. కానీ ఆడియన్స్ కామెడీ పరంగా గానీ .. ఎమోషన్స్ వైపు నుంచి గాని ఎక్కడా కనెక్ట్ కాలేకపోతారు. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. గ్రామీణ వాతావరణం .. అక్కడి మనుషులు .. వారి స్వభావాలను సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించిన విధానం మాత్రం ఆకట్టుకుంటుంది.

సందీప్ కిషన్ .. మురళీశర్మ నటన మెప్పిస్తుంది. వేశ్యగా దివ్య పిళ్లై పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆ పాత్రను ఇంకాస్త పెంచవలసిందని అనిపిస్తుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు. లైన్ బాగుంది .. కానీ కంటెంట్ ను కావాల్సినంత వినోదభరితంగా చెప్పలేకపోయారేమోననే భావన కలుగుతుంది.