హిందీ నుంచి వచ్చిన డ్రామా సిరీస్ లలో 'తుక్రా కే మేరా ప్యార్' సిరీస్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. సంచితా బసు - ధవళ్ ఠాకూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ మొదటి సీజన్ కి విశేషమైన స్పందన లభించింది. ఆర్థికపరమైన అంతరం ఇద్దరు ప్రేమికులను ఎలా విడదీసింది? .. వాళ్ల మధ్య శత్రుత్వానికి ఎలా కారణమైంది? అనే అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది. నటన పరంగా సంచితా బసుకి మంచి మార్కులు పడిపోయాయి. అలాంటి ఈ సిరీస్ నుంచి సీజన్ 2 రూపొందింది. ఈ నెల 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 2 నుంచి ముందుగా 4 ఎపిసోడ్స్ ను వదిలారు.
 
కుల్దీప్ కుమార్ (ధవళ్ ఠాకూర్) శాన్విక చౌహన్ (సంచిత బసు) ప్రేమించుకుంటారు. డబ్బు .. పిలుకుబడి ఉన్న మనోహర్ సింగ్, వాళ్ల ప్రేమను తిరస్కరిస్తాడు. ఆయన కారణంగా కుల్దీప్ కి ప్రమాదం ఉందని భావించిన శాన్విక, కుల్దీప్ కుమార్ మనసు విరిగిపోయేలా చేస్తుంది. ఆ కసితోనే అతను కలెక్టర్ అవుతాడు. తన అధికారాలను ఉపయోగించి శాన్విక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటాడు. అయితే రాజకీయ పరమైన .. ముఠాపరమైన కక్షల కారణంగా శాన్విక తన తండ్రిని .. భర్తను కోల్పోతుంది. ఈ సంఘటనలలో కుల్దీప్ హస్తం ఉందని ఆమె అపార్థం చేసుకుంటుంది.

శాన్విక తన తండ్రి స్థానంలో రాజకీయాలలో ముందుకు దూసుకు వెళుతుంటుంది. 'సితారా పూర్' ప్రజలంతా ఆమెను ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు. శాన్వికపై మనసు పారేసుకున్న 'కున్వర్' ఆమెకి సహాయం చేస్తున్నట్టుగా నటిస్తూ, చేరువ కావడానికి ప్రయత్నిస్తుంటాడు. అతని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న శాన్విక, నమ్మినట్టుగా నటిస్తుంటుంది. ఇక శాన్విక కారణంగా తన కూతురు జీవితం ప్రమాదంలో పడుతుందని భావించిన దద్దూ మహారాజ్, ఆమెకి హాని తలపెట్టడానికి సన్నాహాలు మొదలుపెడతాడు. తన మామగారి మనసులోని ఈ దురాలోచనను కుల్దీప్ పసిగడతాడు.

 తాను కలెక్టర్ కావడానికి అవసరమైన సహాయ సహకారాలను రహస్యంగా అందించింది శాన్విక అనే విషయం కుల్దీప్ తెలుసుకుంటాడు. గతంలో ఏ కారణంగా శాన్విక తనకు దూరమైందనేది తెలుసుకుని బాధపడతాడు. ఆమెను కలుసుకుని మాట్లాడాలని భావిస్తాడు. ఒక వైపున కున్వర్ .. ఒక వైపున దద్దూ మహారాజ్ .. మరో వైపున శాన్విక కుటుంబానికి నమ్మకస్తుడైన 'అంగద్' నిజస్వరూపాన్ని కుల్దీప్ పసిగడతాడు. ఆ తరువాత అతను ఏం చేస్తాడు? పర్యవసానంగా ఇటు కుల్దీప్ .. అటు శాన్విక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటారు? అనేది మిగతా కథ.

సితారాపూర్ నేపథ్యంలో నడిచే కథ ఇది. ప్రేమకథ అనేక మలుపులు తీసుకోవడమే ఈ కాన్సెప్ట్ లోని ప్రత్యేకత. ఒక వైపున ప్రేమ ద్వేషంగా మారడం .. మరో వైపున ప్రేమ త్యాగంగా మారడం ఈ కథలో కనిపిస్తుంది. ఒకరి పగ .. అపార్థాలు తొలగిపోయి ప్రేమగా మారిపోతూ ఉంటే, మరొకరి ప్రేమ .. ప్రతీకారంగా మారడం మరో ఆసక్తికరమైన పరిణామంగా కనిపిస్తుంది. ఈ మధ్యలో ఈ ఇద్దరి మధ్య కొత్త శత్రువులు ప్రవేశించడం మరింత నాటకీయతకు కారణమవుతుంది. 

భర్తను కోల్పోయిన శాన్వికను సొంతం చేసుకోవడానికి తెలివిగా కున్వర్ పావులు కదపడం, తన అల్లుడి మనసు మళ్లీ శాన్విక వైపు మళ్లే ప్రమాదం ఉందని భావించి, శాన్వికను చంపించడానికి దద్దూ మహారాజ్ పన్నే వ్యూహాలు ఈ కథను మరింత రసవత్తరంగా మారుస్తాయి. అధికారాలు చేతులు మారడం .. నమ్మిన వ్యక్తులు మారిపోవడం వంటి రాజకీయపరమైన పరిణామాలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తూ ముందుకు సాగుతాయి. 

ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా గొప్పగా నటించారు. అందరిలో సంచితా బసు నటనకు ఎక్కువ మార్కులు పడతాయి. నిలకడగా .. నిబ్బరంగా పోరాటం సాగించే ఒంటరి యువతిగా ఆమె అభినయం మెప్పిస్తుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఎడిటింగ్ వైపు నుంచి చూసుకుంటే, అనవసరమైన సన్నివేశాలు ఎక్కడా కనిపించవు. 

సీజన్ వన్ కి మంచి పేరు వచ్చింది కదా అని, అక్కడి నుంచి సీజన్ 2 కోసం కథను సాగదీయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ 'తుక్రా కే మేరా ప్యార్' విషయంలో అలా అనిపించదు. ఎందుకంటే కథ అనేకమైన శాఖలుగా చాలా విస్తృతమైనదిగా తయారు చేయబడింది. వారం .. వారం వదిలే ఎపిసోడ్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా సాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.  ప్రతికోణం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ప్రేమ .. ద్వేషం .. ప్రతీకారం .. ద్రోహం .. పశ్చాత్తాపం.. ఇలా అనేకమైన అంశాలను కలుపుకుంటూ, బలమైన స్క్రీన్ ప్లేతో సాగే ఈ కంటెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.