మిస్టరీ థ్రిల్లర్ కథలను తెరకెక్కించడంలో మలయాళం దర్శకులు మంచి నైపుణ్యాన్ని చూపిస్తారనే ఒక టాక్ ఉంది. అందుకు తగిన విధంగానే వాళ్లు ఈ జోనర్ నుంచి ఎక్కువ హిట్స్ ను వదులుతూ ఉంటారు. అలా రూపొందిన సినిమానే 'సంభవం అధ్యాయం ఒన్ను'. జీతూ సతీషన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మార్చి 6వ తేదీన థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచి మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లోను జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

కర్ణాటక - కేరళ సరిహద్దు ప్రాంతంలోని ఒక పోలీస్ స్టేషన్ కి సీపీఓ ఆనంద్ (అస్గర్ అలీ)కి బదిలీ అవుతుంది. మరో నెలలో డెలివరీ కానున్న తన భార్య 'నీతూ'ను వదిలి అతను అయిష్టంగానే బయల్దేరతాడు. విధుల్లో చేరడానికి అతను పోలీస్ స్టేషన్ కి వెళుతుండగా, వేరే రాష్ట్రానికి చెందిన ఒక పోలీస్ ఆఫీసర్ ను జీపు ఢీ కొడుతుంది. అతణ్ణి హాస్పిటల్లో చేర్పించిన తరువాతనే అతని పేరు జాన్ పీటర్ అనే విషయం ఆనంద్ కి తెలుస్తుంది. జాన్ పీటర్ దగ్గర లభించిన 'వాకీ టాకీ'ని తన దగ్గరే ఉంచుతాడు ఆనంద్.   

కొత్తగా డ్యూటీలో చేరిన ఆనంద్ కి పోలీస్ ఆఫీసర్ 'అశోకన్' తో .. మరో ఆఫీసర్ 'రెజీ'తో పరిచయం ఏర్పడుతుంది. ముగ్గురూ కలిసున్న సమయంలో జాన్ పీటర్ వాకీ టాకీ మోగుతుంది. అడవిలో తాను ఆపదలో ఉన్నాననీ, తనని కాపాడమని పోలీస్ ఆఫీసర్ స్టీఫెన్ అభ్యర్థిస్తాడు. అతను చెబుతున్న ఆనవాళ్ల ఆధారంగా ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ముందుకు వెళతారు. అలావాళ్లు మానవ దేహం .. కాకి తల కలిగిన ఒక విగ్రహం దగ్గరికి చేరుకుంటారు. 

ఆనంద్ వేరే రాష్ట్రానికి సంబంధించిన సదరు పోలీస్ స్టేషన్ కి కాల్ చేస్తాడు. అక్కడ ఉన్నతాధికారిగా ఉన్న ఉజ్వల్ తో మాట్లాడతాడు. హాస్పిటల్లో ఉన్న జాన్ పీటర్ గురించి .. అడవిలో ఆపదలో ఉన్న స్టీఫెన్ గురించి వాళ్లకి చెబుతాడు. ఆ పేరుతో ప్రస్తుతం తమ పోలీస్ స్టేషన్లో ఎవరూ పనిచేయడం లేదనీ, ఆ పేరుగల వాళ్లు 30 ఏళ్ల క్రితం అడవిలో కనిపించకుండా పోయారని ఉజ్వల్ సమాధానమిస్తాడు. ఆ మాటకి ఆనంద్ .. అశోకన్ .. రెజీ ఆశ్చర్యపోతారు. 

జాన్ పీటర్ .. స్టీఫెన్ బృందం 30 ఏళ్ల క్రితం దట్టమైన ఆ అడవిలోకి ఎందుకు వెళ్లారు? మానవ దేహంతో .. కాకి తలతో ఉన్న విగ్రహం అక్కడ ఎందుకు ఉంది? అక్కడికి వెళ్లినవారిలో ఎవరూ ఎందుకు వెనక్కిరాలేకపోతున్నారు? ఆ ప్రదేశానికి చేరుకున్న ఆనంద్, అక్కడి నుంచి బయటపడగలిగాడా లేదా ? అనేవి ఆసక్తిని రేకెత్తించే అంశాలు. 

రెండు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఒక దట్టమైన ఫారెస్ట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక పోలీస్ బృందం అడవిలో ఆపదలో చిక్కుకుంటుంది. మరో రాష్ట్రానికి చెందిన పోలీస్ బృందం, వాళ్లను కాపాడటం కోసం ఆ ఫారెస్టులోకి అడుగుపెడుతుంది. అసలు ఆ అడవిలో ఏం జరుగుతోంది? అక్కడ వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే దిశగా దర్శకుడు ఈ కథను నడిపించాడు.

ఈ కథ హీరోను 30 ఏళ్లపాటు కాలంలో వెనక్కి తీసుకుని వెళుతుంది .. అలాగే కాలంలో ముందుకు తీసుకుని కూడా వెళుతుంది .. అది కూడా అడవి నేపథ్యంలో మాత్రమే. ఒక కాలంలో ఉన్న వారు .. మరో కాలంలో ఉన్నవారు ఫోన్లో కనెక్ట్ అయ్యేలా చేసే శక్తి ఆ అడవికి ఉంటుంది.  ఇలాంటి ఒక విభిన్నమైన .. విలక్షణమైన కథను దర్శకుడు తయారు చేసుకున్న విధానం గొప్పగా అనిపిస్తుంది. అడవి నేపథ్యంలోని సన్నివేశాలు తెరపై ఉత్కంఠభరితంగా కదులుతాయి.

ఒక వైపున పోర్చుగీసు రాణి ప్రేమాయణం .. మరో వైపున అడవిలోని తెగలపై వారు కొనసాగించిన మారణకాండ వంటి ఫ్లాష్ బ్యాకులు ఈ కథపై మరింత ఆసక్తిని పెంచుతాయి. అడవిలో శబ్దం చేయకూడదు .. ఎవరి రక్తం కూడా పొరపాటున నేలపై పడకూడదు .. అనే అంశాలు ప్రేక్షకులలో మరింత కుతూహలాన్ని పెంచుతూ వెళతాయి. ఈ అంశాల కారణంగానే అడవి నేపథ్యంలోని  సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. 

అస్గర్ అలీతో పాటు ప్రధానమైన పాత్రలను పోషించిన నటులంతా చాలా బాగా చేశారు. తెరపై పాత్రలు మినహా ఆర్టిస్టులు కనిపించరు. నిజానికి ఈ సినిమా కథ - స్క్రీన్ ప్లే చాలా క్లిష్టమైనవిగా కనిపిస్తాయి. అయినా సాధ్యమైనంత వరకూ తేలికగా అర్థమయ్యేలా ఆవిష్కరించాడనికి దర్శకుడు ప్రయత్నించాడని చెప్పాలి.

నవీన్ నజోస్ కెమెరా పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. వర్షం నేపథ్యంలో ఫారెస్టు సన్నివేశాలను ఆయన చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక గాడ్విన్ థామస్ అందించిన నేపథ్య సంగీతం కూడా గొప్పగా అనిపిస్తుంది. కథను పట్టుగా పరిగెత్తించడంలో ముఖ్యమైన పాత్రలను పోషించింది. అర్జున్ ప్రకాశ్ ఎడిటింగ్ కూడా మంచి మార్కులు కొట్టేస్తుంది.

ఈ మధ్య కాలంలో మంచి వైవిధ్యం ఉన్న కథతో వచ్చిన సినిమాగా ఇది ప్రశంసలు అందుకుంటుందని చెప్పాలి. ఈ కథలోని మలుపులు చాలా కీలకమైనవి మాత్రమే కాదు, క్లిష్టమైనవి కూడా. ట్విస్టులు ఆడియన్స్ ఊహకి అందనివిగా ఉంటాయి. అందువల్లనే సాధారణ ప్రేక్షకులకు కాస్త అయోమయంగా అనిపిస్తాయి. హీరో ఎప్పుడు ఏ కాలంలో ఉన్నాడనే విషయంలో ఇంకాస్త క్లారిటీ ఇస్తే బాగుండేదేమో అనే భావం కలిగిస్తాయి.