నటుడిగా .. గాయకుడిగా .. సంగీత దర్శకుడిగా రఘు కుంచెకి మంచి పేరు ఉంది. ఈ మధ్య కాలంలో ఆయన నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలను ఎక్కువగా చేస్తూ వెళుతున్నాడు. ముఖ్యంగా విలేజ్ నేపథ్యంలోని సినిమాలలో ఆయన ఎక్కువగా కనిపిస్తున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'గేదెల రాజు' - కాకినాడ తాలూకా అనేది ట్యాగ్. ఏప్రిల్ 24వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 17వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ డ్రామా జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
'కాకినాడ' పరిసర ప్రాంతాలలో 'భగవాన్ రాజు' అలియాస్ 'గేదెల రాజు' (రఘు కుంచె) తెలియని వారంటూ ఉండరు. ఊళ్లో పనీపాటా లేని కుర్రాళ్లంతా అతని అనుచరులే. డబ్బు .. అమ్మాయిలపై అతనికి వ్యామోహం ఎక్కువ. అందువలన ఆడపిల్లల తల్లిదండ్రులు భయంతో బ్రతుకుతుంటారు. తన రౌడీయిజానికి రాజకీయం కూడా తోడైతే బాగుంటుందని భావించిన గేదెలరాజు', ముందుగా కార్పొరేటర్ కావాలని కంకణం కట్టుకుంటాడు. ఈ విషయంలో అతనికి 'దుర్గ'(శ్రీకాంత్ అయ్యంగార్) అడ్డుపడుతుంటాడు.
గేదెల రాజు - దుర్గ ఇద్దరూ ఒకప్పుడు మంచి స్నేహితులు. కొన్ని కారణాలు వాళ్లను శత్రువులుగా మారుస్తాయి. 'దుర్గ' సంపాదన అంతా కిరాయికి తిరుగుతున్న అతని బోట్లపైనే ఆధారపడి ఉంటుంది. తన వ్యాపారానికి ఎదురులేకుండా ఉండటం కోసం అతను అధికారం కోసం పాకులాడుతుంటాడు. గేదెల రాజుకి వ్యతిరేకంగా తన అనుచరుల సంఖ్యను పెంచుతూ ఉంటాడు. తానే కార్పొరేటర్ కావాలనే పట్టుదలతో ఉంటాడు. అందుకు సంబంధించిన ప్రయత్నాలు గట్టిగానే చేస్తుంటాడు.
ఇక ఆ ఊళ్లో ఎక్కువగా వినిపించే పేరు 'రిచ్'. చెల్లెలు 'దివ్య' అంటే అతనికి చాలా ఇష్టం. దివ్య స్నేహితురాలైన 'మీరా' (మౌనిక)ను అతను ప్రేమిస్తూ ఉంటాడు. అలాగే 'మల్లవరం' గ్రామానికి చెందిన మరో ప్రేమజంటగా విజయ్ - సత్య (టీనా శ్రావ్య) కనిపిస్తారు. ఈ ఇద్దరూ ఒక హాస్పిటల్లో పనిచేస్తుంటారు. భర్తను కోల్పోయిన మీరా తల్లి, గేదెలరాజుతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఉంటుంది. మరో వైపున సత్యతో పాటు ఆమె ఆస్తిపై కూడా గేదెల రాజు కన్నేస్తాడు.
గేదెలరాజు తమ్ముడు 'శ్యాంబాబు' అన్నచేసే అరాచకాలకు నాయకత్వం వహిస్తుంటాడు. అయితే అన్నయ్య చేస్తున్న పెత్తనానికి తాను వారసుడిని కావాలనే ఒక బలమైన కోరిక అతనిలో ఉంటుంది. ఇక గతంలో గేదెలరాజుతో కలిసి పనిచేసిన శివయ్య, అతని కారణంగా జైలు జీవితం గడిపొస్తాడు. అప్పటి నుంచి గేదెలరాజుపై ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం వెయిట్ చేస్తుంటాడు. ఈ నేపథ్యలోనే గేదెలరాజు హత్య జరుగుతుంది. అతణ్ణి చంపింది ఎవరు? ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో తేలే నిజాలేమిటి? అనేది కథ.
కాకినాడ పరిసర గ్రామాలు .. అక్కడి రాజకీయాలు .. పదవుల కోసం పడే పోటీలు .. అక్రమ వ్యాపారాలు .. ముఠాకక్షలు .. సాధారణ ప్రజలతో పాటు, వాటి బారినపడే ప్రేమికుల చుట్టూ తిరిగే కథ ఇది. మొదటి నుంచి చివరి వరకూ గ్రామాలు .. అక్కడి పరిస్థితులను కలుపుకుంటూ ముందుకు సాగుతుంది. ఒక వైపున గేదెల రాజు హవా కొనసాగడాన్ని చూపిస్తూ, రెండు జంటలకు సంబంధించిన ప్రేమకథలలో కదలిక తీసుకొచ్చారు.
సాధారణంగా ఏ కథలోనైనా హీరో - విలన్ ఇద్దరూ ఉంటారు. కానీ ఈ కథలో హీరో - విలన్ ఇద్దరూ ఒక్కరే .. అతనే గేదెలరాజు. కథలో పవర్ఫుల్ గా కనిపించే పాత్ర .. ప్రధానమైన పాత్ర ఏదైతే ఉంటుందో, ఆ పాత్రకి చివరి వరకూ ఏమీ కాదు. ఒకవేళ ఏదైనా జరిగితే అక్కడి నుంచి ఆ కథను ముందుకు నడిపించడం చాలా కష్టమైన విషయం. కానీ ఈ కథలో అందుకు భిన్నంగా జరుగుతుంది. ప్రధానమైన పాత్రగా కనిపించే 'గేదెలరాజు' హత్యతోనే ఈ కథ మొదలవుతుంది.
గేదెలరాజు చాలా బలవంతుడు, డబ్బు - పలుకుబడి - మందీ మార్బలం ఉన్నవాడు. అలాంటి అతణ్ణి ఎవరు చంపేసి ఉంటారు? అనే దిశగానే ఈ కథ తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. ఓ ఇరవైఏళ్ల వెనక్కి తీసుకుని వెళ్లి, అక్కడి నుంచి గేదెలరాజు లీలా విశేషాలను మనకి చూపిస్తూ రావడం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అతని శత్రువులు .. అతనితో ముడిపడిన ప్రేమకథలు తెరపైకి వస్తాయి.
గేదెలరాజును ఎవరు చంపేసి ఉంటారు? అనే అంశమే ఆడియన్స్ లో ఉత్కంఠను రేపుతుందని దర్శకుడు భావించి ఉండొచ్చు. అయితే అసలైన గేదెలరాజే చనిపోయిన తరువాత మిగతా కథను తెలుసుకోవడానికి ప్రేక్షకులలో ఎక్కువమంది అంత సిద్ధంగా ఉండకపోవచ్చు. సినిమాల వరకూ చూసుకుంటే, చనిపోయిన ఒక వ్యక్తి తాలూకు హీరోయిజాన్ని .. విలనిజాన్ని ఎంత గొప్పగా చూపించినా ఆశించినస్థాయి ప్రయోజనం ఉండకపోవచ్చునేమో.
విలేజ్ నేపథ్యంలో 'గేదెల రాజు' పాత్రను డిజైన్ చేసుకున్న తీరు చాలా బాగుంది. అయితే ఆయన ప్రధాన శత్రువులైన దుర్గ .. శివయ్య పాత్రలను అంత సమర్థవంతంగా మలచలేకపోయారు. ఇక రెండు ప్రేమ జంటలకు సంబంధించిన ట్రాక్ కూడా అంత బలంగా అనిపించదు. ఇందుకు సంబంధించిన సన్నివేశాల ఆవిష్కరణపై ఇంకాస్త కసరత్తు చేయవలసిందేమో అనిపిస్తుంది.
నేరం ఎవరు చేశారు? అనే కోణంపై ఆడియన్స్ లో ఆసక్తి పెరగాలంటే, ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉండాలి. కానీ ఈ ట్రాక్ కూడా బలహీనంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ పాత్ర చాలా వీక్ గా అనిపిస్తుంది. చాలా ముఖ్యమైన ఈ పాత్ర విషయంలో కేర్ తీసుకోవాల్సింది. కొన్ని పాత్రలకి జరిగిన ఆర్టిస్టుల ఎంపిక చూస్తే రాంగ్ ఛాయిస్ అని కూడా అనిపిస్తుంది. 'రిచ్' వంటి పేర్లు పిలవడం .. పలకడం కూడా కష్టమేనని గ్రహించాలి.
కుంచె రఘు యాక్టింగ్ బాగుంది. 'గేదెలరాజు' పాత్రలో ఆయన మెప్పించాడు. ఆయన స్వరపరిచిన ఒక మెలోడీ బాగుంది. నేపథ్య సంగీతం అక్కడక్కడా కాస్త ఇబ్బంది పెడుతుంది. ఇక మిగతా పాత్రలేవీ అంతగా ప్రభావితం చేయలేదు. ఆ స్థాయిలో డిజైన్ చేసే ప్రయత్నాలు జరగలేదు. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ ఫరవాలేదు. కథలో అనవసరమైన సన్నివేశాలు .. అవసరానికి మించిన పాత్రలు కూడా కనిపిస్తాయి.
'గేదెలరాజు' (ఆహా) మూవీ రివ్యూ!
Gedela Raju Review
Movie Details
Movie Name: Gedela Raju
Release Date: 2026-07-17
Cast: Raghu Kunche,Vikas Muppala,Teena Sravya,Ramachandram,Ravi Anand Chinnibilli,Mounika Kalapala,Srikanth Iyengar
Director: Chaitanya Moturi
Music: Raghu Kunche
Banner: Moturi Talkies
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer