'బేబీ గర్ల్' ( సోనీ లివ్) మూవీ రివ్యూ!



మలయాళంలో థ్రిల్లర్ జోనర్ కి చెందిన సినిమాలకి, ఓటీటీలో మంచి క్రేజ్ ఉంటుంది. అందుకు కారణం ఆ జోనర్ పై వారికి గట్టి పట్టు ఉండటమే. ఒక చిన్న పాయింట్ ను పట్టుకుని, చివరివరకూ ఆడియన్స్ లో ఆసక్తిని రేపడంలో వారు సిద్ధహస్తులుగా కనిపిస్తారు. అలాంటి మలయాళంలో వచ్చిన మరో థ్రిల్లర్ మూవీనే 'బేబీ గర్ల్'. నివిన్ పౌలి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, జనవరి 23వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 12వ తేదీ నుంచి 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా, తాజాగా తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.  

సనల్ (నివిన్ పౌలి) ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో అటెండర్ గా పనిచేస్తూ ఉంటాడు. మెటర్నిటీ వార్డులో అతనికి డ్యూటీ పడుతుంది. అయితే అతని భార్య సౌదీ నుంచి వస్తుండటంతో, ఆ రోజున అతను డ్యూటీకి ఆలస్యంగా వస్తాడు. ఆ రోజునే సెక్యూరిటీ గార్డు సుకుమారన్ ముందుగానే ఇంటికి వెళ్లిపోతాడు. ఆ సమయంలోనే మెటర్నిటీ వార్డు నుంచి ఒక పసిబిడ్డ అదృశ్యమవుతుంది. దాంతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంటుంది.

సనల్ డ్యూటీకి ఆలస్యంగా రావడం వల్లనే పసిబిడ్డ కిడ్నాప్ జరిగిందని భావించిన హాస్పిటల్ యాజమాన్యం, ముందుగా అతణ్ణి జాబ్ నుంచి తొలగిస్తారు. తాను జాబ్ మానేసి సౌదీ నుంచి వస్తే, సనల్ జాబ్ కూడా పోవడం పట్ల అతని భార్య ఆందోళన చెందుతుంటుంది. ఇక ఆ పసిబిడ్డ తల్లిదండ్రులు బీటెక్ చదువుతున్న యువతీ యువకులు. ప్రేమ పేరుతో తొందరపడిన కారణంగా మీనాక్షి - ఆకాశ్ కి ఆ పాప పుడుతుంది. 

మీనాక్షి వైపు తప్పు ఉందని ఆకాశ్ పేరెంట్స్, అతని వైపు తప్పు ఉందని ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. ఆ పసిబిడ్డ జాడను వెతికి పట్టుకునే పనిలో, పోలీసులకు సహకరించాలని సనల్ అనుకుంటాడు. అయితే అతనిపై కూడా వాళ్లకి అనుమానం ఉంటుంది. ఆ విషయాన్ని పెద్దగా లెక్క చేయకుండా తనకి అనుమానాన్ని కలిగించిన అంశాలను అన్వేషిస్తూ వెళతాడు సనల్. ఆ ప్రయత్నంలో అతనికి రీతూ - రిషి పేర్లు వినిపిస్తాయి. వాళ్లిద్దరూ ఎవరు? వాళ్ల కారణంగా సనల్ కి ఎదురయ్యే పరిణామాలు ఎలాంటివి? అనేది కథ.

బాబీ - సంజయ్ తయారు చేసుకున్న కథ ఇది. హాస్పిటల్ నుంచి మూడు రోజుల పసిబిడ్డ కిడ్నాప్ అవుతుంది. అందుకు తాను కూడా బాధ్యుడినేనని భావించిన అటెండర్ ఆ పసిబిడ్డను వెతకడం మొదలుపెడతాడు. తక్కువమంది సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ, పోలీసులు తమవంతు ప్రయత్నం చేస్తుంటారు. ఈ కిడ్నాప్ వెనుక ఎవరున్నారు? అందుకు గల కారణం ఏమిటి? అనేది తెలుసుకోవడానికి ఇప్పుడు ఆడియన్స్ పరిగెత్తవలసి ఉంటుంది. 

సాధారణంగా మలయాళ దర్శకులు ఆడియన్స్ ను కదలనీయకుండా కూర్చోబెట్టడానికి ఈ మాత్రం కథ సరిపోతుంది .. స్క్రీన్ ప్లే సరిగ్గా వేసుకుని ఉంటే. కానీ ఆ స్క్రీన్ ప్లే దెబ్బ కొట్టేసింది. కథనం మలుపులు తీసుకుంటూ వెళుతూ ఉంటుంది. కానీ ఏ మలుపు కూడా ఉత్కంఠభరితంగా అనిపించదు. పైగా ఆ బేబీ దొరకడం వలన ప్రయోజనం ఏమిటి? అంటూ ఆడియన్స్ ను ముందుగానే నీరు గార్చేశారు. దాంతో ఆ బేబీ దొరకాలని ఎవరూ కోరుకోని పరిస్థితి.

ఇక కథకి రెండో వైపుకి వెళితే, పసిబిడ్డ కనిపించకుండా పోవడానికి కారకులు ఎవరు? వాళ్ల ఉద్దేశం ఏమిటి? అనేది చూస్తే, అక్కడ కూడా కొత్తదనం లేని కథనే పలకరిస్తుంది. ఆడియన్స్ ఆశించే బలమైన కారణం ఇక్కడ మనకి కనిపించదు. పసిబిడ్డ కనిపించకుండా పోవడం .. కనిపించకుండా చేయడం .. ఈ రెండు కారణాల మధ్య ఎమోషన్ కనెక్ట్ కాదు. దాంతో ఓ సాదాసీదా కథ మాదిరిగానే ఇది కనిపిస్తుంది.    

కనిపించకుండా పోయిన పసికందు, ప్రధానమైన పాత్రల జీవితాలను ప్రభావితం చేసేదై ఉండాలి. ఒక్క హీరో వైపు నుంచి తప్ప అలాంటి ఆరాటం ఏ వైపు నుంచి లేకపోవడం నిరాశ పరుస్తుంది. పోలీసులు .. మీడియా చేసే హడావిడి మినహా, కథలో విషయం కనిపించదు. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ కూడా ఆడియన్స్ ను పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. ఓ మాదిరి సినిమాగానే ఇది మిగిలిపోతుంది.  

నివిన్ పౌలి .. సంగీత్ ప్రతాప్ .. లిజోమోల్ జోస్ .. ఈ మూడు పాత్రలు మాత్రమే ప్రధానమైనవిగా కనిపిస్తాయి. వాళ్ల నటన చాలా సహజంగా అనిపిస్తుంది. మిగతా పాత్రల ప్రభావం అంతగా కనిపించదు. కాసేపు హడావుడి చేసి పక్కకి తప్పుకుంటాయి. ఫైజ్ సిద్ధిక్ ఫొటోగ్రఫీ .. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం .. షియాజిత్ కుమారన్ ఎడిటింగ్ ఫరావాలేదు అనిపిస్తుంది. 

 ఓ కార్పొరేట్ హాస్పిటల్ నుంచి మూడు రోజుల బేబీ మిస్సింగ్ తో ఈ కథ మొదలవుతుంది. ఇక్కడి నుంచి ఈ కథ అనేక మలుపులు తీసుకుంటుందనీ, ఆ ట్విస్టులు ఒక రేంజ్ లో ఉంటాయని ఆడియన్స్ అనుకుంటారు. కానీ అలాంటివేం లేకుండా సాదాసీదాగా సాగిపోతుంది. ఆశించినస్థాయిలో ఈ కంటెంట్ ఆకట్టుకోలేకపోయింది.

Movie Details

Movie Name: Baby Girl

Release Date:

Cast: Nivin Pauly, Sangeeth Prathap, Lijomol Jose, Aditi Ravi, Mythili, Akshay

Director: Arun Varma

Producer: Listin Stephen

Music: Sam C S

Banner: Magic Frames

Baby Girl Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews