సుమంత్ ప్రభాస్ హీరోగా చేసిన సినిమానే 'గోదారి గట్టుపైన'. గతంలో 'మేం ఫేమస్' అంటూ వచ్చిన సుమంత్ ప్రభాస్, హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని ఆయన చేసిన సినిమానే ఇది. తెలంగాణ నేసథ్యంతో కూడిన కథతో మొదటి సినిమా చేసిన తను, అందుకు పూర్తి భిన్నంగా గోదావరి యాస నేపథ్యంలో ఈ సినిమాను చేశాడు. ఈ సినిమాతో కోలీవుడ్ బ్యూటీ 'నిధి ప్రదీప్' తెలుగు తెరకి పరిచయమైంది. ఈ రోజునే థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం.
అది 'తణుకు' సమీపంలోని 'మంచిలి' అనే విలేజ్. అక్కడ రాజు ( సుమంత్ ప్రభాస్) ఆటో నడుపుతూ తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉంటాడు. తల్లి .. తండ్రి .. చెల్లెలు సమైక్య .. ఇదీ అతని కుటుంబం. ఇక తన స్నేహితులైన రహీమ్ (సుదర్శన్) .. రాబర్ట్( రాజ్ కుమార్ కసిరెడ్డి)తో తన ఎమోషన్స్ ను ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటాడు. రాజు చెల్లెలు 'సమైక్య' స్నేహితురాలే మాయ ( నిధి ప్రదీప్). ఆమె ఓ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న శ్యామ్ బాబు (జగపతిబాబు) కూతురు.
శ్యామ్ బాబుకి తన కూతురు 'మాయ' అంటే ప్రాణం. డబ్బుకి ఇబ్బంది లేని కుటుంబానికి తన కూతురును కోడలిగా పంపించాలనేది ఆయన ఆలోచన. అయితే సమైక్య ద్వారా మాయకి రాజుతో పరిచయవుతుంది. తాను ఇంజనీరింగ్ చదువుతున్నప్పటికీ, పెద్దగా చదువు అబ్బని రాజు పట్ల అభిమానం పెంచుకుంటుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. అప్పటి నుంచి మాయ ధోరణిలో మార్పు రావడాన్ని శ్యామ్ బాబు గమనిస్తాడు. అందుకు కారణం ఏమిటనేది ఒక కంట గమనిస్తూ ఉండమని, తన భార్య ఝాన్సీ ( లైలా)ను హెచ్చరిస్తాడు.
ఒక రోజున శ్యామ్ బాబు తన కూతురుకి ఒక సంబంధం తీసుకొస్తాడు. తన కూతురు భవిష్యత్తు అన్ని విధాలుగా బాగుంటుందని అతను నమ్మిన సంబంధం అది. తాను ఆటో డ్రైవర్ రాజును లవ్ చేస్తున్నట్టుగా అప్పుడే తండ్రితో చెబుతుంది మాయ. అప్పుడు శ్యామ్ బాబు ఏం చేస్తాడు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? రాజు - మాయ పెళ్లి జరుగుతుందా? తన కూతురుకు గొప్ప సంబంధం చేయాలనే శ్యామ్ బాబు కోరిక నెరవేరుతుందా? అనేది మిగతా కథ.
ఒక మధ్య తరగతి తండ్రికి తన కూతురు విషయంలో అనేక భయాలు ఉంటాయి. ఆమె పెళ్లికి దగ్గర పడుతున్నా కొద్దీ అతనిలో భయంతో పాటు బాధ్యత కూడా పెరుగుతూ పోతుంది. తన కూతురికి ఎలాంటి ఇబ్బందులు లేని సంబంధం చేయాలని ఆ తండ్రి కోరుకుంటాడు. ఆ తండ్రి ఆశలకు పూర్తి విరుద్ధమైన వ్యక్తిని ప్రేమిస్తున్నట్టు ఆ కూతురు చెబితే ఎలా ఉంటుందనే ఒక ఆసక్తికరమైన అంశంతో ఈ కథ వేగాన్ని పుంజుకుంటుంది.
హీరో - హీరోయిన్ పరిచయం .. సాన్నిహిత్యం .. ప్రేమ .. అలకలతో ఫస్టాఫ్ సాగుతూ వెళుతుంది. వాళ్ల మధ్య ప్రేమ బలపడుతూ ఉన్న సమయంలోనే, చదువుతో పాటు కులమతాలు అడ్డుగోడలుగా మారడం మొదలవుతుంది. ఈ అడ్డుగోడలను ఈ ప్రేమ జంట ఎలా దాట గలిగిందనేది సెకండాఫ్ పై కుతూహలాన్ని పెంచుతుంది.సెకండాఫ్ అంతా ఈ ప్రేమ పక్షులు ఎదుర్కునే పరీక్షలతోనే కొనసాగుతుంది.
'గోదారి గట్టుపైన' .. ఇది ఒక రాజు గాడి ప్రేమకథ. లేదంటే ఒక ఆటోవాలా ప్రేమకథగా చెప్పుకోవచ్చు. చదువుకున్న అమ్మాయికీ .. చదువు అబ్బని ఆటోడ్రైవర్ కి మధ్య నడిచే ప్రేమకథ ఇది. ప్రేమకి కులమతాలు లేవు .. ప్రేమికులకు అవి అడ్డుగోడలు కాదు. అభ్యంతరాలు ఉన్నవాళ్లు ఆ తరువాత అర్థం చేసుకుని సర్దుకుపోవలసిందే అని నిరూపించే కథ ఇది. ఆల్రెడీ ఇలాంటి కథలు గతంలో చాలానే వచ్చాయి గదా? అనే ప్రశ్న తప్పకుండా ఎదురవుతుంది. కాస్త అటు ఇటుగా అలాంటి ప్రయత్నమే మళ్లీ జరిగితే తప్పేం లేదు కదా! అనే సమాధానంతో సరిపెట్టుకోవలసిందే .
రొటీన్ గా సాగే ఈ ప్రేమకథలో జగపతి బాబు - లైలా పాత్రలు కాస్త బలంగానే కనిపిస్తాయి. కానీ ఆ పాత్రలను పవర్ఫుల్ గా ఆవిష్కరించలేకపోయారు. కథలో కీలకమైన మలుపు జగపతిబాబు దగ్గరికి వచ్చి ఆగేసరికి, మిగిలి ఉన్న సమయం చాలా తక్కువ. ఆ సమయంలో కూడా ఆ పాత్రను ఆయనకి గల క్రేజ్ కి తగినట్టుగా పరిగెత్తించలేదు. అసలు కూతురు లవ్ మేటర్ శ్యామ్ బాబుకి ఎప్పుడు తెలుస్తుందా అనే ఉత్కంఠతోనే ఆడియన్స్ వెయిట్ చేస్తూ కూర్చుంటారు. ఇంటర్వెల్ తరువాత చాలా సేపటికి గానీ, వాళ్ల కల ఫలించదు. కథ రొటీన్ గా ఉండటంతో, విషయం లేకపోయినా సుదర్శన్ కామెడీనే బెటర్ గా భావించి ప్రేక్షకుడు పరిగెడుతూ ఉంటాడు.
ఇక ప్రీ క్లైమాక్స్ లో సుమంత్ ప్రభాస్ .. జగపతి బాబు .. లైలా .. రాజీవ్ కనకాలకి రాసిన డైలాగ్స్ సింపుల్ గా అనిపిస్తూనే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. క్లైమాక్స్ అందరూ ఊహించినట్టుగానే ఉంటుంది. సుమంత్ ప్రభాస్ నటన బాగుంది. కాకపోతే గోదావరి యాసలో డైలాగ్స్ చెప్పడానికి బాగానే ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తుంది. నిధి ప్రదీప్ నటన కూడా ఆకట్టుకుంటుంది. ఆమె కళ్లు ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తాయి.
జగపతిబాబు యాక్టింగ్ చాలా సహజంగా అనిపిస్తుంది. కాకపోతే ఆ పాత్రకి ఇంకాస్త పవర్ అవసరమని అనిపిస్తుంది. సుదర్శన్ కామెడీ ఆరంభంలో కాస్త అతిగా అనిపించినా, ఆ తరువాత ఆడియన్స్ అలవాటు పడిపోతారు. విలేజ్ నేపథ్యంలో లొకేషన్స్ మనకి బోర్ అనిపించకుండా చూసుకుంటాయి. సాయి సంతోష్ ఫొటోగ్రఫీ .. నాగవంశీ కృష్ణ సంగీతం ఫరవాలేదు.
రొటీన్ గా నడిచే ప్రేమకథ ఇది. కాలవగట్లు .. కలువపూలు .. మిణుగురులు వంటి సన్నివేశాలు కూడా రోటీన్ గానే అనిపిస్తాయి. కామెడీ సన్నివేశాలు కూడా అదే దార్లో పరిగెత్తుతాయి. చివర్లో కొన్ని డైలాగ్స్ మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. అంతకు మించి 'గోదారి గట్టుపైన' మనకి కొత్తగా కనిపించేదేమీ లేదు.
'గోదారి గట్టుపైన' - మూవీ రివ్యూ!
Godari Gattupaina Review
Movie Details
Movie Name: Godari Gattupaina
Release Date: 2026-05-08
Cast: Sumanth Prabhas,Nidhi Pradeep, Jagapathi Babu, Laila, Reenu, Sudharshan, Rajeev Kanakala
Director: Subhash Chandra
Music: Naga Vamshi Krishna
Banner: Red Puppet Production
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer