ఒక వైపున హారర్ థ్రిల్లర్లు .. మరో వైపున క్రైమ్ థ్రిల్లర్లు ఓటీటీలను ఊపేస్తున్నాయి. ఇక అడపా దడపా పొలిటికల్ థ్రిల్లర్లు పలకరిస్తూ వెళుతున్నాయి. అయితే అందుకు భిన్నంగా ఒక సిరీస్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కి వచ్చింది. ఆ సిరీస్ పేరే 'ఎగ్జామ్'. దుషారా విజయన్ - అదితి బాలన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ లో అబ్బాస్ కీలకమైన పాత్రలో కనిపిస్తాడు. 7 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్, ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
మరుమల్లి (అదితి బాలన్) డీఎస్పీ గా పనిచేస్తూ ఉంటుంది. తన కూతురుతో కలిసి తల్లి దగ్గర ఆమె ఉంటూ ఉంటుంది. 'తైకార' అనే ప్రదేశానికి ఆమెకి బదిలీ అవుతుంది. జాయినింగ్ రిపోర్ట్ ను సబ్మిట్ చేయడం కోసం ఆమె ఒంటరిగా బయల్దేరుతుంది. ఫారెస్టు ప్రాంతం మీదుగా వెళుతున్న ఆమెను, ఝాన్సీ (దుషారా విజయన్) కిడ్నాప్ చేస్తుంది. జయచంద్రన్ (అబ్బాస్) సూచన మేరకు, మరుమల్లిని ఒక రహస్య ప్రదేశంలో బంధిస్తుంది.
మరుమల్లి పేరుతో తాను డీఎస్పీగా ఝాన్సీ డ్యూటీలో చేరుతుంది. తాను మరుమల్లిని కాదనే విషయం బయటికి తెలిసేలోగా తాను వచ్చిన పనిని పూర్తి చేయాలని నిర్ణయించుకుంటుంది. పోటీ పరీక్షలు .. ప్రశ్న పత్రాల లీక్ చేసే వ్యవహారాలు .. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కోట్ల రూపాయల స్కామ్ వెనుక ఎవరున్నారనేది తెలుసుకోవడానికి ధైర్యంగా ముందుకు వెళుతుంది. ఆ సమయంలోనే ఆమెకి 'కుమరేశన్' పేరు వినిపిస్తుంది.
కుమరేశన్ ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? పోటీ పరీక్షలకి సంబంధించిన ప్రశ్న పత్రాలను లీక్ విషయంలో అతని పాత్ర ఏమిటి? ఈ మొత్తం వ్యవహారంతో మరుమల్లికి ఉన్న సంబంధం ఎలాంటిది? ఈ విషయంలో ఝాన్సీ ఎందుకు జోక్యం చేసుకుంటోంది? ఆమెను ఇంతటి సాహసానికి పురిగొల్పిన పరిస్థితులు ఎలాంటివి? ఆమెకి సాయం చేసే జయచంద్రన్ ఎవరు? అనే ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది.
చాలామందికి ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక కల. అలాంటి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి వాళ్లంతా ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎలాంటి కోచింగ్ లేని పల్లెటూరి పిల్లలు .. ఆర్ధిక పరమైన ఇబ్బందులతో సతమతమయ్యే పిల్లలు ఆ సమస్యలను దాటుకుంటూ పుస్తకాలపై దృష్టి పెట్టడం సామాన్యమైన విశేషమేం కాదు. అలాంటి పిల్లల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే ఒక నెట్ వర్క్ చుట్టూ తిరిగే కథ ఇది.
ఎంతోమంది తెలివైన పిల్లలు పల్లెటూళ్లకే పరిమితమైపోతున్నారు. ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ కాలం కలిసి రాకపోవడం వలన, పేదరికంలో మగ్గిపోతున్నారు. చదువుకోవాలని ఉన్నప్పటికీ, కూలి పనులను దాటుకుని అడుగుముందుకు వేయలేకపోతున్నారు. కానీ ఎలాంటి ప్రతిభలేని కొంతమంది పిల్లలు అడ్డదారుల్లో మార్కులు సంపాదిస్తున్నారు .. సర్టిఫికెట్లు సంపాదిస్తున్నారు .. ఉద్యోగాలు పొందుతున్నారు.
అయితే ఈ పోటీ ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి పేదరికాన్ని జయించి పట్టణంలో అడుగుపెట్టిన కుమరేశన్ .. ఝాన్సీలకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఆ సవాళ్లను దాటుకుంటూ వాళ్లు ఎలా తమ మార్గంలో ముందుకు వెళతారు? అనే ప్రధానమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. దర్శకుడు నాణానికి ఇరువైపులా అన్నట్టుగా ఒక వైపున కుమరేశన్ ను .. మరో వైపున ఝాన్సీ పాత్రలను చూపిస్తూ కథను పట్టుగా నడిపించాడు.
ఈ కథ మూడు కోణాల వైపు నుంచి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల సమాహారం ఒకటైతే, కుమరేశన్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ .. ఝాన్సీ ఫ్లాష్ బ్యాక్ రెండు వైపులా నుంచి కనెక్ట్ అవుతాయి. ఈ ఇద్దరి ఫ్లాష్ బ్యాకులు ఈ కథకు మరింత బలాన్ని చేకూర్చాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు ఎలా లీక్ అవుతున్నాయి? అవి డబ్బున్న పిల్లల చేతికి ఎలా చేరుతున్నాయి? నిజమైన ప్రతిభ కలిగిన పేద పిల్లలు ఎలా వెనుకబడి పోతున్నారు? సర్కారీ కొలువులు డబ్బున్నవారికి ఎలా అలంకారంగా మారుతున్నాయి? ఇదే పనిగా పెట్టుకున్న నెట్ వర్క్ ఎలా పనిచేస్తుంది? అనేది దర్శకుడు చూపించిన తీరు మెప్పిస్తుంది .. ఆలోచింపజేస్తుంది .. ఆందోళన కలిగిస్తుంది.
'ఎగ్జామ్' అనే టైటిల్ ఈ సిరీస్ కి కరెక్టుగా సరిపోతుంది. కాకపోతే పోటీ పరీక్షలు .. కోచింగ్ సెంటర్లు .. పేపర్ లీక్ కావడం .. అందుకు సంబంధించిన హడావిడి ఎక్కువగా ఉంటుందని అనుకోవడం సహజం. కానీ దర్శకుడు ఈ కథను ఎత్తుకున్న తీరు .. దానిని నడిపించిన విధానం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మొదటి నుంచి చివరివరకూ ఎక్కడా పట్టుసడల కుండా నడుస్తుంది. తమిళంలో భారీ యాక్షన్ డ్రామాలకు ఏ మాత్రం తీసిపోని కంటెంట్ ఇది.
అసలు డీఎస్పీని బంధించి, ఆమె ప్లేస్ లో ఝాన్సీ ఓ పది రోజుల పాటు డీఎస్పీగా కొనసాగడమనే విషయం కాస్త కొరుకుడు పడని అంశమే అయినప్పటికీ, దర్శకుడు కొన్ని రీజన్స్ చెబుతూ కొంత వరకూ కన్వీన్స్ చేయగలిగాడు. దుషారా విజయన్ నటన ఈ సిరీస్ మొత్తానికి హైలైట్ అనే చెప్పాలి. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ .. లొకేషన్స్ వైపు నుంచి ఈ సిరీస్ పూర్తిస్థాయిలో మెప్పిస్తుంది.
తెలివైన పిల్లలను చదువుకి .. ఉద్యోగాలకు దూరం చేయడం వలన వాళ్లు ఎలాంటి మార్గాలను ఎంచుకుంటారు? ఈ సమాజానికి ఎంత ప్రమాదకరంగా మారతారు? అర్హత లేనివారిని అందలాలు ఎక్కించడం వలన సమాజంలో అవినీతి ఎలా పెరిగిపోతుంది? అనే విషయాలతో దర్శకుడు ఆలోచింపజేసిన తీరు ఆకట్టుకుంటుంది.
మత్స్య కారుల కుటుంబం నుంచి వచ్చిన ఒక పేద కుర్రాడు, "అమ్మా చేపల కంపుకి దూరంగా వెళ్లి చదువుకోమని అన్నావు. కానీ కంపు కొడుతున్నది చేపలు కాదమ్మా .. చదువుకునే చోట్లు" అనే డైలాగ్ ఈ సిరీస్ మొత్తాన్ని విప్పి చెబుతుంది. ఈ మధ్య కాలంలో గొప్ప స్క్రీన్ ప్లే తో వచ్చిన బెస్ట్ సిరీస్ 'ఎగ్జామ్' అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.
'ఎగ్జామ్' (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ!
Exam Review
Movie Details
Movie Name: Exam
Release Date: 2026-05-15
Cast: Dushara Vijayan, Adithi Balan, Abbas
Director: Sarkunam
Music: Sam CS
Banner: Wallwatcher Films
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer