తెలుగు తెరపై హ్యాండ్ సమ్ కటౌట్ గా కనిపించే హీరోలలో నాగశౌర్య ఒకరు. ఆరంభంలోనే వరుస విజయాలను అందుకుంటూ వచ్చిన నాగశౌర్య, ఆ తరువాత లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటకి రావడం కోసం, యాక్షన్ పాళ్లు ఎక్కవగా ఉన్న కథలను ఎంచుకుంటూ వచ్చాడు. అలా ఆయన చేసిన సినిమానే 'బ్యాడ్ బాయ్ కార్తీక్'. ఏప్రిల్ 17వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 15వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
 
కార్తీక్ (నాగశౌర్య) తన అక్కయ్య కస్తూరి (శ్రీదేవి విజయ్ కుమార్) ... బావ వాసు (అజయ్)తో కలిసి 'వైజాగ్' లో నివసిస్తూ ఉంటాడు. శ్రీదేవి అడ్వకేట్ గా పనిచేస్తూ ఉంటుంది. అదే వైజాగ్ లో సాయి విక్రమ్ (సాయి కుమార్) పోలీస్ ఆఫీసర్ గా ఉంటాడు. ఆయన కూతురు 'మహా' (విధి యాదవ్)ను కార్తీక్ ఇష్టపడుతూ ఉంటాడు. బీటెక్ పూర్తిచేసిన కార్తీక్, ఊళ్లో అల్లర చిల్లరగా తిరుగుతూ ఉండటంతో, అతణ్ణి పై చదువుల కోసం ఫారిన్ పంపించాలనే ఆలోచనలో కస్తూరి ఉంటుంది.

'కదిరి'లో వరదారెడ్డి (సముద్రఖని) గోవిందప్ప (మైమ్ గోపీ) మధ్య ఫ్యాక్షన్ గొడవలు నడుస్తూ ఉంటాయి. వరదారెడ్డి చెల్లెలు గోవిందప్ప అన్నయ్య మునెప్పను ప్రేమిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న వరదారెడ్డి, తన వాళ్లతో మునెప్పను చంపిస్తాడు. అప్పటి నుంచి వరదారెడ్డిపై  ప్రతీకారంతో గోవిందప్ప రగిలిపోతుంటాడు. సరైన సమయం కోసం అతను వెయిట్ చేస్తూ ఉంటాడు. 

ఈ నేపథ్యంలోనే తన అక్కయ్య కస్తూరిని హత్య చేయించడానికి గోవిందప్ప ప్రయత్నిస్తున్న విషయం కార్తీక్ కి తెలుస్తుంది. అందుకు గల కారణం ఏమిటనేది తెలుసుకోవడం కోసం, కార్తీక్  వైజాగ్ నుంచి కదిరి వెళతాడు. అక్కడ ఏం జరుగుతుంది? కస్తూరి పై గోవిందప్పకి గల కోపానికి కారణం ఏమిటి? వరదారెడ్డితో ముడిపడిన ఆ అక్కాతమ్ముళ్ల గతం ఎలాంటిది? అనేది కథ. 

ఈ కథ వైజాగ్ - కదిరి మధ్య జరుగుతుంది. ఇది అక్కాతమ్ముళ్ల ఎమోషన్స్ కి సంబంధించిన కథ. ఈ రెండు పాత్రలతో పాటు అంతే ప్రధానమైనవిగా వరదారెడ్డి - గోవిందప్ప పాత్రలు కనిపిస్తాయి. ఈ నాలుగు పాత్రలను ప్రధానంగా చేసుకునే ఈ కథ ముందుకు వెళుతూ ఉంటుంది. ఇక ఆ తరువాత స్థానంలో సాయికుమార్ .. అతని కూతురు మహా (హీరోయిన్) పాత్రలు ముఖ్యమైనవిగా  దర్శకుడు ఈ కథను అల్లుకుంటూ వెళ్లాడు. 

ఒక వైపున వైజాగ్ లో తమ్ముడు గురించి అక్క ఆందోళన చెందుతూ ఉంటుంది. మరో వైపున కదిరిలో విలన్స్ మధ్య గొడవగా ఉంటుంది. ఈ రెండు ట్రాకుల మధ్య సంబంధం ఉందనే విషయాన్ని దర్శకుడు హింట్  ఇస్తూ వెళుతుంటాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏమిటనేది తెలుసుకోవాలనే కుతూహలంతో ప్రేక్షకులు ఉంటారు. దర్శకుడు ఈ విషయాన్ని రివీల్ చేసిన తీరు కూడా బాగుంది .. ఆ ట్విస్ట్ చాలా కీలకమైనదని కూడా అనిపిస్తుంది. 

ఇంటర్వెల్ బ్యాంగ్ .. ఆ తరువాత కథపై ఆసక్తిని పెంచేదిలా ఉంటుంది. సెకండాఫ్ లో కార్తీక్ కోసం వరదారెడ్డి అనుచరులు గాలించడం ..  అక్కాతమ్ముళ్ల ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయ్యేవరకూ బాగానే అనిపిస్తుంది. ఇక ఎప్పుడైతే వెన్నెల కిశోర్ ఎంట్రీ ఇస్తాడో అప్పటి నుంచి కథ కాస్త కామెడీ వైపు టర్న్ తీసుకుని చప్పబడిపోయినట్టుగా అనిపిస్తుంది.

నాగశౌర్య పాత్రను, సముద్రఖని .. మైమ్ గోపీ పాత్రలను డిజైన్ చేసిన తీరు బాగుంది. వాళ్ల నటన కూడా బాగుంది. కార్తీక్ .. అతని లవర్ కి సంబంధించిన రొమాన్స్ కి అవకాశం లేకుండా చేశారు. అందువలన ఆ వైపు నుంచి ఆడియన్స్ కి మిగిలేది నిరాశే. ఇక సాయికుమార్ పాత్రను డిజైన్ చేయడంలో కూడా క్లారిటీ లేదనిపిస్తుంది. అలాగే ఎలాంటి విషయం లేకుండా అజయ్ పాత్రను వదిలేశారు.

రసూల్ ఎల్లోర్ ఫొటోగ్రఫీ బాగుంది. హారీస్ జైరాజ్ సంగీతం ఫరవాలేదు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఓకే. కథలోని అక్కాతమ్ముళ్ల ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన ట్విస్ట్ బాగుంది. కానీ ఎమోషన్స్ వైపు నుంచి .. యాక్షన్ వైపు నుంచి నడిచే డ్రామా రొటీన్ గా అనిపిస్తుంది. రొమాన్స్ కి ఛాన్స్ ఇవ్వకపోవడం మరో లోపంగా అనిపిస్తుంది.