కాలేజ్ నేపథ్యంతో కూడిన కంటెంట్ తో గతంలో చాలానే సిరీస్ లు వచ్చాయి. అలాగే ఇప్పుడు మరో సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సిరీస్ పేరే 'బ్యాచ్ మేట్స్'. శ్రీహర్ష శెట్టి దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఏప్రిల్ 30వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్'లో మొదలైంది. ముందుగా 4 ఎపిసోడ్స్ ను స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్స్ వదులుతూ వెళుతున్నారు. ప్రస్తుతం 8 ఎపిసోడ్స్ అందుబాటులోకి వచ్చాయి.

హైదరాబాద్ లోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో సిద్ధార్థ్ .. మహేశ్ .. సంహిత .. గోల్డీ కొత్తగా జాయిన్ అవుతారు. సిద్ధార్థ్ తల్లి మాలారెడ్డి (భావన) ఒక డాక్టర్. కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని ఆమె సిద్ధార్థ్ కి పదే పదే చెబుతూ ఉంటుంది. ఇంట్లో ఒక  ఆత్మీయ పూర్వకమైన వాతావరణం లేకపోవడం, సిద్ధార్థ్ కి అసంతృప్తిని కలిగిస్తూ ఉంటుంది. కాలేజ్ లో స్నేహతుల కారణంగా అతను ఆ బాధను మరిచిపోతుంటాడు. 

కాలేజ్ లో సుహాస్ కి అంతా భయపడుతుంటారు. అతను సీనియర్ అని మాత్రమే కాదు, డీన్ కొడుకు కావడం మరో కారణం. కాలేజ్ లో రౌడీయిజం చెలాయిస్తూ అతను కాలక్షేపం చేస్తుంటాడు. సిద్ధార్ బ్యాచ్ కాలేజ్ లో చేరిన తొలి రోజులలోనే సుహాస్ తో గొడవ జరుగుతుంది. అప్పటి నుంచి అతను ఈ బ్యాచ్ ను టార్గెట్ చేస్తూ వేధిస్తుంటాడు. తన కారణంగా సంహిత .. గోల్డీ ఇబ్బంది పడుతుండటంతో, తమని వదిలేయమని సుహాస్ ను సిద్ధార్థ్ కోరతాడు.

కాలేజ్ స్టాఫ్ రూమ్ లో .. ఫలానా ర్యాక్ లో ఉన్న ఒక కవర్ తీసుకొచ్చి తనకి ఇస్తే ఇక వాళ్ల జోలికి రాననని సుహాస్ అంటాడు. తన బ్యాచ్ తో కలిసి ఒక రాత్రివేళ కాలేజ్ స్టాఫ్ రూమ్ లోకి వెళ్లిన సిద్ధార్థ్ ఆ కవర్ ను చేజిక్కించుకుంటాడు. ఆ కవర్లో మరునాడు జరగవలసిన ఎగ్జామ్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఆ తరువాత ఏం జరుగుతుంది? సిద్ధార్థ్ బ్యాచ్ ఎలాంటి పరిణామాలను ఫేస్ చేయవలసి వస్తుంది? అనేది మిగతా కథ.

ఎక్కడెక్కడి నుంచో సిటీకి వచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ లలో చేరేవాళ్లు ఉంటారు. రకరకాల ఫ్యామిలీ నేపథ్యాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ పై ఆ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. చదువుకోవడం కోసం వచ్చిన స్టూడెంట్స్ కొందరైతే .. వాళ్లను చెడగొట్టడం కోసమే వచ్చినట్టుగా కనిపించేవారు మరికొందరు. ప్రేమ పేరుతో పెడతోవ పట్టేవారు కొందరైతే, అమాయకత్వం కారణంగా ఆవేదన చెందేవారు మరికొందరు. ఇక డబ్బు - అధికారం ఉన్నవారికి వత్తాసు పలికే యాజమాన్యం మరొకవైపు. 

ఇలా ఒక వైపున స్టూడెంట్స్ .. మరో వైపున యాజమాన్యం ధోరణి చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఈ కథలో ఎక్కువ భాగం ఇంజనీరింగ్ కాలేజ్ చుట్టూ తిరుగుతుంది. మధ్యమధ్యలో ఆయా స్టూడెంట్స్ ఫ్యామిలీ నేపథ్యాలను టచ్ చేస్తూ వెళ్లారు. అటు ఇంటి దగ్గర గానీ .. ఇటు కాలేజ్ లో గాని ఒక సరైన వాతావరణం లేనప్పుడు స్టూడెంట్స్ ఎలాంటి అయోమయానికి లోనవుతారు? అనే విషయాన్ని ఆవిష్కరించడానికి తమవంతు ప్రయత్నం చేశారు.

కాలేజ్ లలో సీనియర్స్ ధోరణి ఎలా ఉంటుంది? కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ పట్ల వాళ్లు ఎలా ప్రవర్తిస్తారు? ర్యాగింగ్ కారణంగా స్టుడెంట్స్ ఎలాంటి ఇబ్బందులు పడుతుంటారు? అనే విషయాలను ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. అలాగే యాజమాన్యం ఎవరికో కొమ్ము కాయడానికి ప్రయత్నించడం వలన, మిగతా స్టూడెంట్స్ జీవితాలు ఎలా 'బలి' అవుతాయనే విషయాన్ని ఆవిష్కరించారు. 

అయితే ఈ 8 ఎపిసోడ్స్ లోని కథవరకూ చూసుకుంటే, చాలా కాలంగా చూస్తూ వచ్చిన సన్నివేశాలే మళ్లీ మనకళ్ల ముందు కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. లవ్ .. ఫ్రెండ్షిప్ కి సంబంధించిన సన్నివేశాలు కూడా చాలా నీరసంగా కొనసాగుతాయి. అలాగే కాలేజ్ రౌడీయిజం కూడా అంత ఎఫెక్టివ్ గా ఏమీ అనిపించదు. ఇక కామెడీ నవ్వించకపోగా కాస్త ఇబ్బంది పెడుతుందనే చెప్పాలి. 

8 ఎపిసోడ్స్ మొత్తంగా చూసుకుంటే, చెప్పిన కథ చాలా తక్కువ. గతంలో చూసిన సన్నివేశాలని తిరగేసి మరగేసి సాగదీస్తూ వెళ్లారు. లవ్ .. కామెడీ .. ఫ్రెండ్షిప్ .. ఎమోషన్స్ ఏవీ కూడా కనెక్ట్ కాలేకపోయాయి. ఆర్టిస్టుల నటన కూడా అంతంత మాత్రంగానే అనిపిస్తుంది. ఆ పాత్రల ద్వారా ప్రేక్షకులను కథలోకి తీసుకుని వెళ్లలేకపోయారు. 

 సంభాషణలు కూడా చాలా పేలవంగా అనిపిస్తాయి. కృతకంగా అనిపించే సన్నివేశాలు, ఆడియన్స్ ను కథలో భాగం కాకుండా చేస్తుంటాయి. కథ .. కథనం .. పాత్రలను డిజైన్ చేసే విధానంలో .. ఆ పాత్రల నుంచి అవుట్ పుట్ ను రాబట్టే విషయంలో మరింత కసరత్తు చేసి ఉంటే బాగుండేది.  ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. ఇంతవరకూ నడిచిన కథ అయితే రొటీన్. ఇక మిగిలిన ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేది చూడాలి.