ఫార్ములా-ఈ కేసు: కేటీఆర్‌కు బిగ్ షాక్.. పాస్‌పోర్ట్ జప్తునకు కోర్టు ఆదేశం!

ఫార్ములా-ఈ కేసు: కేటీఆర్‌కు బిగ్ షాక్.. పాస్‌పోర్ట్ జప్తునకు కోర్టు ఆదేశం!

Formula E Case Big shock to KTR as court orders passport impounding
  • కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్టులు సీజ్ చేయాలని సూచన
  • నిధుల దుర్వినియోగం ఆరోపణలపై కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు
  • నిందితులు విదేశాలకు వెళ్లకుండా నిరోధించేందుకే ఈ చర్యన్న ఏసీబీ అధికారులు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావుకు ఏసీబీ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్టులను తక్షణమే తాత్కాలికంగా జప్తు (ఇంపౌండ్) చేయాలంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయాన్ని (ఆర్‌పీవో) ఆదేశించింది. ఈ మేరకు న్యాయస్థానం ఆర్‌పీవోకు అధికారికంగా లేఖ రాసింది. కోర్టు ఆదేశాలతో ఈ కేసు మరోసారి రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా-ఈ రేసులో నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీ విచారణకు ఆదేశించింది. దర్యాప్తు చేపట్టిన ఏసీబీ అధికారులు 2024 డిసెంబరులో అప్పటి పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఫార్ములా-ఈ ఆపరేషన్స్ ప్రతినిధి అల్బెర్టో లోంగోలపై కేసు నమోదు చేశారు.

ఈ కేసులో భాగంగా ఇప్పటికే నిందితులందరినీ విచారించి, వారి వాంగ్మూలాలను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. అనంతరం కోర్టులో అభియోగపత్రం కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, నిందితులు విదేశాలకు వెళ్లకుండా నిరోధించేందుకే వారి పాస్‌పోర్టులను జప్తు చేయాలని ఏసీబీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, ఆర్‌పీవోకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో ఐదో నిందితుడైన అల్బెర్టో లోంగో విదేశీయుడు కావడంతో, ఆయన పాస్‌పోర్టును జప్తు చేసే అధికారం ఇక్కడి అధికారులకు లేదు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేటీఆర్‌తో పాటు మిగతా ముగ్గురి పాస్‌పోర్టుల జప్తుపై ఆర్‌పీవో తదుపరి చర్యలు తీసుకోనుంది.
Advertisement
KT Rama Rao
Formula E case
ACB Court Hyderabad
Passport impounded
Telangana politics
BRS Party

More Telugu News