అంబటి రాంబాబుకు మరో షాక్.. విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు

అంబటి రాంబాబుకు మరో షాక్.. విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు

Ambati Rambabu summoned by Enforcement Directorate for questioning
  • అంబటికి ఈ నెల 11వ తేదీన ఈడీ నోటీసులు
  • విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్న వైనం
  • అయితే ఆ నోటీసులు తనకు అందలేదన్న అంబటి
  • దాంతో, నేడు ఫోన్ ద్వారా సమాచారం అందించిన అధికారులు
  • ఇప్పటికే అంబటిపై పలు కేసులు నమోదు

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ ఈ నెల 11వ తేదీనే నోటీసులు పంపినట్టు ఈడీ అధికారులు ఆయనకు నేడు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయితే తనకు నోటీసులు అందలేదని ఈడీ అధికారులకు అంబటి తెలిపారు. దీంతో, విచారణకు తప్పనిసరిగా  హాజరుకావాలంటూ ఆయనకు అధికారులు స్పష్టం చేశారు. పలు వివాదాస్పద అంశాలు, చట్టపరమైన కేసుల్లో వార్తల్లో నిలిచిన ఆయనకు, ఈడీ నేరుగా సమన్లు జారీ చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.


గతంలోనే అంబటి రాంబాబుపై పలు పోలీస్ కేసులు నమోదు కావడంతో పాటు, ఆయన సుమారు 18 రోజుల పాటు రిమాండ్‌లో కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై తిరుపతి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి విచారణకు రావాలని ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటికి తోడు ఇప్పుడు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాల్లో ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం గమనార్హం.


మరోవైపు, అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు రావడంపై వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోలీసులను, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి తమ నేతలపై కుట్రపూరితంగా కేసులు బనాయిస్తోందని ఆరోపిస్తున్నారు.

Advertisement
Ambati Rambabu
Enforcement Directorate
YSRCP
Andhra Pradesh Politics
ED Notices
Financial Investigation

More Telugu News