అనాలోచిత నీటి నిర్వహణతో రైతాంగానికి తీరని ద్రోహం: చంద్రబాబుపై సాకే శైలజానాథ్ ధ్వజం
- కృష్ణా, గోదావరి నదుల నీటి నిర్వహణను చంద్రబాబు లోపభూయిష్టంగా మార్చారన్న శైలజానాథ్
- రైతుల కన్నీళ్లు ఆయనకు కనిపించడం లేదని మండిపాటు
- పోలవరం ప్రాజెక్టును బ్యారేజీగా మార్చేశారని విమర్శ
ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న సాగునీటి ఎద్దడి, తీవ్ర వర్షాభావ పరిస్థితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనాలోచిత విధానాలే కారణమని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత సాకే శైలజానాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణా, గోదావరి నదుల నీటి నిర్వహణను లోపభూయిష్టంగా మార్చి రాష్ట్ర రైతాంగానికి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. ఇప్పటికీ ‘వ్యవసాయం దండగ’ అనే పాత ఆలోచనా ధోరణిలోనే చంద్రబాబు ఉన్నందున రైతు అనుభవించే కష్టాలు, కన్నీళ్లు ఆయనకు కనిపించడం లేదని విమర్శించారు.
శ్రీశైలం ప్రాజెక్టు కింద సాగయ్యే వేలాది ఎకరాల పంట భూములు నీళ్లు లేక బీడులుగా మారాయని, రాష్ట్రంలో ఏర్పడింది ప్రకృతి సిద్ధమైన ఎల్నినో కాదని, ముమ్మాటికీ ఇది 'ఎల్లోనినో' అని శైలజానాథ్ దుయ్యబట్టారు. శ్రీశైలం జలాశయం జలకళతో ఉందంటూ యెల్లో మీడియా భజన చేస్తోందని, అంతగా నీళ్లు ఉంటే గ్రేటర్ రాయలసీమకు ఆరుతడి పంటలకు కూడా నీటిని ఎందుకు విడుదల చేయడంలేదని ప్రశ్నించారు. శ్రీశైలంలో నీటిమట్టం 840 అడుగులకు పడిపోతే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా నీరు ఇచ్చే అవకాశం ఉండదని హెచ్చరించారు. నెల్లూరు బ్యారేజీ కింద వరి పైరుతో పాటు, రాయలసీమలో ఎండిపోతున్న చీనీ, అరటి తోటలు, శనగ పంటలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
వెలిగొండ, పోలవరం వద్ద చంద్రబాబు సాష్టాంగ నమస్కారాలు చేయడం తప్ప, పంట పొలాలకు సాగునీరు ఇచ్చిన దాఖలాలు లేవని, ఆఖరికి పోలవరం ప్రాజెక్టును రిజర్వాయర్ నుంచి బ్యారేజీగా మార్చేసి ప్రజలకు ద్రోహం చేశారని ఆరోపించారు. పక్కనున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు రైతులకు సాగునీరు అందిస్తుంటే, ఏపీలో ఎందుకు ఇవ్వడంలేదని నిలదీశారు. సీమ ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాయలసీమకు నీటిని విడుదల చేయించాలని పిలుపునిచ్చారు.