చంపడానికైనా, చావడానికైనా సిద్ధమనడం అరాచకం: వైసీపీ ఎమ్మెల్సీ భరత్ వ్యాఖ్యలపై భానుప్రకాశ్ రెడ్డి ఫైర్
- రక్తాభిషేకం చేసైనా గెలుస్తామన్న వైసీపీ ఎమ్మెల్సీ భరత్
- 11 సీట్లకు పడిపోయినా వైసీపీ నేతల్లో మార్పు రాలేదన్న భానుప్రకాశ్ రెడ్డి
- భరత్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్
కుప్పం నియోజకవర్గంలో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ భరత్ చేసిన వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు మెంబర్, బీజేపీ సీనియర్ నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "చంపడానికైనా, చావడానికైనా సిద్ధపడేవారికే టికెట్లు ఇస్తాం.. ప్రత్యర్థులు రక్తాన్ని కోరుకుంటే రక్తాభిషేకం చేసైనా సరే గెలుస్తాం" అని ఎమ్మెల్సీ భరత్ వ్యాఖ్యానించడం ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా అవమానించడమేనని, ఇది వైసీపీ నాయకత్వంలోని అరాచకత్వానికి పరాకాష్ఠ అని మండిపడ్డారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేసి ఘోర పరాజయాన్ని అందించినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. 2019-24 మధ్య ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను 'రాక్షస ప్రదేశ్'గా మార్చారని తీవ్రంగా విమర్శించారు. రాజకీయాల్లో శాంతియుత పోటీ ఉండాలి కానీ... చంపుతాం, చస్తాం అంటూ భయానక వాతావరణం సృష్టించడం సరికాదని హితవు పలికారు. ప్రజల మధ్య హింసను ప్రేరేపిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్‌పై పోలీసులు తక్షణమే సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.