పదో తరగతి ఫెయిల్.. గ్రేస్ మార్కులతో పాసయ్యా: మంత్రి నారాయణ

Minister Narayana failed 10th class but reached heights with determination
  • చదువుతో పేదరికాన్ని జయించవచ్చన్న మంత్రి నారాయణ
  • పదో తరగతి ఫెయిల్ అయినా పట్టుదలతో పైకొచ్చానని వెల్లడి
  • నెల్లూరులో ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డుల ప్రదానం
  • విద్యావ్యవస్థలో లోకేశ్ విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని ప్రశంస
  • అవకాశాలను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు పిలుపు
 చదువుతో పేదరికాన్ని జయించవచ్చని, కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. సోమవారం నెల్లూరు జిల్లాలో జరిగిన 'షైనింగ్ స్టార్ అవార్డ్స్ - 2026' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు, మెడల్స్, నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ తన జీవితంలోని ఆసక్తికర విషయాలను విద్యార్థులతో పంచుకున్నారు. తాను పదో తరగతి ఫెయిల్ అయ్యానని, ఆ తర్వాత గ్రేస్ మార్కులతో పాస్ అయినట్లు వెల్లడించారు. ఆ వైఫల్యమే తనలో పట్టుదలను పెంచిందని, మూడేళ్ల డిగ్రీలో యూనివర్శిటీ టాపర్‌గా నిలిచి స్టాటిస్టిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించానని గుర్తుచేసుకున్నారు. కష్టపడి చదివితేనే లక్ష్యాలను చేరుకోగలరని విద్యార్థులకు సూచించారు.

చదువు పూర్తయ్యాక వీఆర్సీలో రూ.40 జీతానికి పార్ట్‌టైం లెక్చరర్‌గా పనిచేశానని, ప్రభుత్వ అధ్యాపకుడిగా అవకాశం వచ్చినా రాజీనామా చేసి, ట్యూషన్లు చెబుతూ కష్టపడి ఈ స్థాయికి వచ్చానని వివరించారు. యువనేత నారా లోకేశ్ ఆధ్వర్యంలో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని మంత్రి కొనియాడారు. ఈ మార్పులను, అందివస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Advertisement
Ponguru Narayana
Shining Star Awards Nellore
AP Municipal Administration Minister
Nara Lokesh education reforms
Success story after failing 10th
Collector Himanshu Shukla

More Telugu News