ఏపీకి నేను మేనమామను... మేనమామ ఎప్పుడూ ఉత్త చేతులతో రాడు: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్

Shivraj Singh Chouhan says I am the maternal uncle of AP and a maternal uncle never comes empty handed
  • చంద్రబాబు, పవన్‌తో కలిసి వీబీ జీ రామ్ జీ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి
  • రాష్ట్రానికి 74,212 పక్కా ఇళ్లు, రోడ్లకు రూ.422 కోట్లు ప్రకటించిన చౌహన్
  • వీబీ జీ రామ్ జీ కింద ఏపీకి 9 నెలల్లో రూ.7,700 కోట్లు విడుదల చేస్తామని హామీ
  • మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద తోతాపురి మామిడి కొనుగోలుకు అంగీకారం
ఆంధ్రప్రదేశ్‌కు తాను మేనమామ లాంటి వాడినని, మేనమామ ఎప్పుడూ ఖాళీ చేతులతో రాడని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అన్నారు. తనను మధ్యప్రదేశ్‌లో ప్రజలంతా ఆప్యాయంగా 'మామాజీ' అని పిలుస్తారని, ఇప్పుడు ఏపీ ప్రజలకు కూడా తాను మేనమామనే అయ్యానని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి వరాల జల్లు కురిపిస్తూ, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద 74,212 పక్కా ఇళ్లు, గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.422 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు అందజేశారు.

తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అజీవికా మిషన్’ (వీబీ జీ రామ్ జీ)ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి శివరాజ్ సింగ్ చౌహన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ఏపీ నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం చారిత్రక ఘట్టమని ఆయన అభివర్ణించారు. 

దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్ధి కోసం ఈ పథకం కింద రూ.7.5 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే 9 నెలల కాలానికి గాను ఈ పథకం కింద ఏపీకి రూ.7,700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ సభలే తమకు అవసరమైన పనులను ఎంపిక చేసుకుని అమలు చేసే అధికారం ఈ పథకం కల్పిస్తుందని వివరించారు.

ఈ సందర్భంగా రైతుల కోసం మరో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని రైతుల నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 2,16,250 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని కేంద్రం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను కూడా ఆయన ముఖ్యమంత్రికి అందజేశారు. 

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, ఎట్టిపరిస్థితుల్లోనూ చేయి విడిచిపెట్టే ప్రసక్తే లేదని చౌహన్ స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజున ఒక మొక్క నాటాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేశ్ పాశ్వాన్, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Shivraj Singh Chouhan
Andhra Pradesh Development
Chandrababu Naidu
PMAY Houses AP
Viksit Bharat GRAM Mission
AP Rural Development

More Telugu News