చైనా లక్ష్యంగా భారత్‌ కొత్త వ్యూహం.. దూరం నుంచే దెబ్బ

India new strategy targeting China strike from distance
  • చైనాను దృష్టిలో పెట్టుకుని రక్షణ వ్యూహాలు రూపొందిస్తున్న భారత్‌
  • దీర్ఘశ్రేణి క్షిపణుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
  • భారత్‌ వద్ద 24 అగ్ని-5 క్షిపణులు ఉన్నట్లు SIPRI అంచనా
  • అగ్ని-5 పరిధి సుమారు 5,000 కిలోమీటర్లు
  • దేశీయ రక్షణ ఉత్పత్తి రూ.1.78 లక్షల కోట్లకు పెరుగుదల
  • డ్రోన్లు, సైబర్‌ యుద్ధ సామర్థ్యాలపై భారత్‌ ఫోకస్
భారత సైనిక ఆధునికీకరణ కొత్త దశకు చేరుకుంటోంది. ఒకప్పుడు ప్రధానంగా పాకిస్థాన్‌ను దృష్టిలో పెట్టుకుని రక్షణ వ్యూహాలను రూపొందించిన భారత్‌.. ఇప్పుడు చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లపై మరింత దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల దీర్ఘశ్రేణి క్షిపణులు, అధునాతన ఆయుధ వ్యవస్థల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోంది.

అంతర్జాతీయ పరిశోధనా సంస్థ SIPRI తాజా నివేదిక ప్రకారం.. చైనా సైనిక శక్తి పెరుగుతుండటం, పాక్‌తో దాని వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడటం భారత్‌ రక్షణ ప్రణాళికలపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో దూరప్రాంతాల్లోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించే సామర్థ్యాలను భారత్‌ వేగంగా పెంచుకుంటోంది. గతంలో సుమారు 2,000 కిలోమీటర్ల పరిధి ఉన్న అణ్వాయుధ సామర్థ్య క్షిపణులకే పరిమితమైంది. ఇప్పుడు 3,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే క్షిపణులను సైన్యంలోకి తీసుకొస్తోంది. ఈ ఏడాది జనవరి నాటికి భారత్‌ వద్ద 24 అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఈ క్షిపణి సుమారు 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేరుకోగలదని అంచనా.

ఆధునిక యుద్ధాల్లో డ్రోన్లు, సైబర్‌ దాడులు, కచ్చితమైన లక్ష్యఛేదన సామర్థ్యాల ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌ స్వదేశీ రక్షణ తయారీపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. 2014-15లో రూ.46,400 కోట్లుగా ఉన్న దేశీయ రక్షణ ఉత్పత్తి విలువ.. 2024-25 నాటికి రూ.1.78 లక్షల కోట్లకు చేరుకుంది. రక్షణ ఎగుమతులు కూడా రికార్డు స్థాయిలో రూ.38,400 కోట్లకు పెరిగాయి.

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల చోటుచేసుకున్న యుద్ధాలు, ప్రాంతీయ ఘర్షణలు భారత్‌కు కొత్త పాఠాలు నేర్పాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో అధునాతన డ్రోన్లు, దీర్ఘశ్రేణి ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ ఆధారిత రక్షణ భాగస్వామ్యాలపై కేంద్రం మరింత దృష్టి పెడుతున్నట్లు నివేదిక పేర్కొంది.
Advertisement
India
China
Agni 5 missile
Indian military modernization
SIPRI report
Defense exports India

More Telugu News