పోలీస్ స్టేషన్ ఎదుట స్నానం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి... వీడియో ఇదిగో!
- పోలీస్ స్టేషన్ ఎదుట స్నానం చేసి వినూత్న నిరసన తెలిపిన జేసీ
- మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు
- కేసు నమోదుతో తన నిరసన దీక్షను విరమించిన ప్రభాకర్ రెడ్డి
- ఇది తన వ్యక్తిగత పోరాటమేనని, పార్టీకి సంబంధం లేదని స్పష్టీకరణ
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగానే ఇప్పుడూ పోలీసులు తమపై కక్ష సాధిస్తున్నారని, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి కొమ్ముకాస్తున్నారని జేసీ ఆరోపించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం పెద్దారెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన దీక్షకు దిగారు. తనకు 74 ఏళ్ల వయసని, పదవులపై ఆశ లేదని, కానీ పోలీసుల తీరుకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసనతో పోలీసులు వెనక్కి తగ్గారు. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కేతిరెడ్డి పెద్దారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 196(1) కింద కేసు నమోదు చేశారు. దీంతో ప్రభాకర్ రెడ్డి తన దీక్షను విరమించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన జేసీ, తాడిపత్రిలో నెలకొన్న పరిస్థితులపై జిల్లా ఎస్పీతో తేల్చుకుంటానని అన్నారు. ఇందుకోసం వచ్చే సోమవారం తన అనుచరులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఈ పోరాటానికి టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని ఆయన స్పష్టం చేశారు. "మేము తాడిపత్రిలో ఉండాలా? వద్దా? అనే విషయాన్ని నేరుగా ఎస్పీనే అడిగి తెలుసుకుంటాం" అని జేసీ వ్యాఖ్యానించారు.