భారత ఏఐ ఆశలకు బిగ్‌ బూస్ట్‌.. ఆస్ట్రేలియన్‌ కంపెనీ రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు

AirTrunk announces 30 billion dollar investment for India data centers
  • భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు చేయనున్న ఎయిర్‌ట్రంక్‌
  • ప్రధాని మోదీతో సంస్థ సీఈఓ రాబిన్ ఖుదా భేటీ
  • 5 గిగావాట్ల సామర్థ్యంతో సరికొత్త కేంద్రాలు
  • హైదరాబాద్, చెన్నై నగరాల్లో ప్రాజెక్టుల విస్తరణ
  • ఎయిర్‌ట్రంక్‌ నిర్ణయంపై ప్రధాని హర్షం
భారత్‌ను అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్ హబ్‌గా మార్చే దిశగా చరిత్రాత్మక ముందడుగు పడింది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ డేటా సెంటర్ల సంస్థ ‘ఎయిర్‌ట్రంక్’ రాబోయే నాలుగేళ్లలో మనదేశంలో ఏకంగా 30 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 2.50 లక్షల కోట్లు) భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ భారీ ప్రాజెక్టు ద్వారా భారతదేశంలో ఐదు గిగావాట్ల సామర్థ్యం గల సరికొత్త డేటా సెంటర్లను నిర్మించనున్నారు. సిడ్నీ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఎయిర్‌ట్రంక్ సంస్థకు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు బ్లాక్‌స్టోన్, కెనడియన్ పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ నిధులు సమకూరుస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో ‘లుమినా క్లౌడ్‌ఇన్‌ఫ్రా’ సంస్థను కొనుగోలు చేయడం ద్వారా ఎయిర్‌ట్రంక్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది.

మోదీ శుక్రవారం ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో సమావేశమయ్యారు. అనంతరం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. దేశ డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలోనే ఇది భారీ పెట్టుబడి అని కొనియాడారు. ఈ ప్రాజెక్ట్ వల్ల దేశంలో లక్షలాది ఉపాధి అవకాశాలు లభిస్తాయని, స్థానిక సప్లై చైన్ వ్యవస్థ బలోపేతం అవుతుందని, క్లౌడ్ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఎయిర్‌ట్రంక్ సంస్థ ముంబై, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో 600 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులను నిర్మిస్తోంది. తాజా రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ సామర్థ్యాన్ని మరింత విస్తరించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ రేసు తీవ్రమవుతోందని, పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ చూపిస్తున్న వేగం, పారదర్శకత తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని రాబిన్ ఖుదా ప్రశంసించారు.

భారత్‌లో ఇప్పటికే గూగుల్ సంస్థ విశాఖపట్నంలో తన మొదటి ఏఐ హబ్‌ను ఏర్పాటు చేయడానికి 15 బిలియన్ డాలర్ల (2026-2030 మధ్య) పెట్టుబడులను ప్రకటించింది. అలాగే దేశీయ దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్ కూడా ఏఐ, డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం సుమారు 100 బిలియన్ డాలర్లకు పైగా భారీ నిధులను కేటాయించాయి. ఈ భారీ పెట్టుబడుల ప్రవాహం భారత్‌ను ప్రపంచ డిజిటల్ అడ్డాగా మార్చబోతోంది.
Go Back to Shorts
AirTrunk
India AI investment
Data center infrastructure
Robin Khuda
Narendra Modi
Blackstone
Cloud computing India
Foreign direct investment
Digital India
Artificial Intelligence

More Telugu News