ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థలు ఏపీలో పనిచేయాలి: చంద్రబాబునాయుడు

Chandrababu Naidu Wants Art of Living to Work in Andhra Pradesh
  • ఫౌండేషన్ 45 వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
  • హింసలేని సమాజం, ఒత్తిడి లేని మనుషులు అనే అంశాన్ని బోధిస్తున్నారన్న సీఎం
  • గ్రామాల నుంచి కొలంబియా వరకు అనిశ్చితి నెలకొంటే చర్చల ద్వారా మార్పులు తెచ్చినట్లు వెల్లడి
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పని చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీ రవిశంకర్ గురూజీ జన్మదినోత్సవంతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవంలో పాల్గొనటం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.

కేవలం ఓ ముఖ్యమంత్రిగానే ఇక్కడికి రాలేదని, ఓ భారతీయుడిగా, గురూజీ బోధనల్ని అనుసరిస్తున్న వ్యక్తిగా ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు. ఆయన కేవలం ఓ ఆధ్యాత్మికతను బోధించే ఓ గురువు మాత్రమే కాదని, శాంతిసామరస్యాలను చాటిచెప్పే ప్రపంచ మానవుడని కొనియాడారు. ప్రాచీన భారతీయ విజ్ఞానానికి ఆధునిక ప్రపంచానికి వారధిగా శ్రీరవిశంకర్ గురూజీ వ్యవహరిస్తున్నారుని అన్నారు. హింసలేని సమాజం-ఒత్తిడి లేని మనుషులు అనే అంశాన్ని సాధించాలని దశాబ్దాలుగా బోధిస్తూ మానవాళికి గొప్పసేవ చేస్తున్నారని కితాబిచ్చారు.

యుద్ధాలతో శాంతికి దూరమైన సమాజాన్ని, అనిశ్చితి నుంచి బయటపడేసేలా మానవత్వం అనే అత్యుత్తమ మార్గాన్ని ఆయన ఎంచుకున్నారని కొనియాడారు. యుద్ధక్షేత్రాల నుంచి ట్రాన్స్ ఫర్మేటివ్ పవర్, డైలాగ్, ఇన్నర్ స్ట్రెంత్ అనే విధానాలను అనుసరించారని పేర్కొన్నారు. గ్రామాల నుంచి అంతర్జాతీయ స్థాయి సంస్థల వరకూ, అనిశ్చితి నెలకొన్న కొలంబియా ప్రాంతాల వరకూ చర్చలు అనే శాంతి మార్గం ద్వారా మార్పులు తెచ్చారని గుర్తు చేశారు. సామాన్య ప్రజలతో పాటు అంతర్జాతీయ సంస్థల విశ్వాసాన్ని గెలుచుకున్న ఆధ్యాత్మికవేత్త శ్రీ రవిశంకర్ గురూజీ అన్నారు.

45 ఏళ్లక్రితం హ్యాపీ హ్యూమన్ బీయింగ్, స్ట్రెస్ ఫ్రీ సొసైటీ బెటర్ వరల్డ్ అనే విజన్ తో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోట్లాది మందికి ప్రేరణగా నిలిచిందని ముఖ్యమంత్రి అన్నారు. సురక్షిత తాగునీరు, రివర్ రిజునవేషన్, మహిళా స్వయం  సమృద్ది, విలువలతో కూడిన విద్య లాంటి రంగాల్లో ప్రజలకు సేవలందిస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ ను ఆయన అభినందించారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీలు రోజువారీ జీవితంలో చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయని వెల్లడించారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు  ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తున్నాయని, సామాన్య ప్రజల జీవితాలు కూడా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోందని అన్నారు. గ్యాస్, ఇంధనం లాంటి వనరుల మార్కెట్ లభ్యత ప్రజలను ఒత్తిడికి గురి చేస్తోందని తెలిపారు. ఈ సమయంలో ఒత్తిడిని ఎదుర్కోని సమర్ధంగా జీవించాల్సిన అవశ్యకత ఉందని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలోనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంటి సంస్థలు మానవాళికి అత్యుత్తమ సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రధాని మోదీ లాంటి సమర్ధవంతమైన నేత దేశానికి నేతృత్వం వహిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా భారత్ అగ్రగామిగా మారుతుందని జోస్యం చెప్పారు. వేల ఏళ్ల క్రితం వరకూ మానవాళిని నడిపించిన నేల ఇది. ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపించిన దేశం మనదని పేర్కొన్నారు. ఆధునిక జీవనంలో శాంతిని సాధించేలా శ్రీ రవిశంకర్ గురూజీ తన బోధనలతో ప్రభావితం చేశారని, సంస్కృతితో మిళితమైన ఆధునికత, విలువలతో కూడిన జీవనం లాంటి ఎన్నో అంశాల ద్వారా తన బోధనల్ని సాగిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో మేం కూడా ప్రజాప్రతినిధులు, అధికారులకు కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా తరగతులు నిర్వహించామని గుర్తు చేశారు.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వెలసిన నేల నుంచి తాను వచ్చానని, ప్రపంచంలో ఉండే హిందువులంతా ఒక్కసారైన తిరుపతి శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటారని అన్నారు. శ్రీశైలం, ఆహోబిలం, అన్నవరం, సింహాచలం లాంటి అధ్యాత్మిక క్షేత్రాలు నిండిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను రాష్ట్రంలో నిర్మిస్తున్నామని, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. అభివృద్ధి అంటే కేవలం ఆర్ధిక ప్రగతి, టెక్నాలజీ మాత్రమే కాదని, ప్రజల జీవన ప్రమాణాలు మార్చటమేననేది తన భావన అన్నారు. ప్రతీ పౌరుడూ శాంతి సౌఖ్యాలు, ఆనందంగా జీవించాలన్నదే తన అభిప్రాయమని పేర్కొన్నారు. ఏపీ సమీకృత అభివృద్ధి సాధించాలన్నదే తన లక్ష్యం కూడా అన్నారు.

ఏపీలోని ప్రతీ పౌరుడికీ అత్యుత్తమ జీవన ప్రమాణాలు కల్పించేలా సంకల్పం తీసుకున్నామని చంద్రబాబునాయుడు అన్నారు. అందుకే పీ4 లాంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అందుకే స్వర్ణాంధ్ర 2047 విజన్ కూడా అమలు చేశామని వెల్లడించారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీని తయారు చేయటమే తన లక్ష్యమని పేర్కొన్నారు. సాంకేతికత సాయంతో ఏపీని గ్లోబల్ ఎకానమీలో ఓ కీలకమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. అదే సమయంలో ఎలాంటి ఒత్తిడిలేని సమాజాన్ని కూడా తీసుకురావాలని పేర్కొన్నారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఇంత అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ ప్రజల్లో శాంతి సౌఖ్యాలు రావాలంటే ఆధ్యాత్మికత అవసరమని పేర్కొన్నారు. దీనికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంటి సంస్థలు ఏపీలో పనిచేయాలని కోరారు.

గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆశీస్సులు పొందిన ఎంపీ సానా సతీష్ బాబు 

బెంగళూరులో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వార్షికోత్సవ కార్యక్రమంలో  ఆధ్యాత్మిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆశీస్సులను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పొందారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం గురుదేవ్‌కు పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ, గురుదేవ్ ఆశీస్సులు పొందడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆధ్యాత్మికత మనిషిలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడమే కాకుండా, సమాజసేవలో మరింత బాధ్యతతో పనిచేయడానికి ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు.

  
Go Back to Shorts
Chandrababu Naidu
Art of Living
Sri Sri Ravi Shankar
Andhra Pradesh
AP Development
Spiritual Tourism

More Telugu News