సమ్మె పరిష్కారం కాదు.. విధుల్లో చేరండి: ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి

Ponnam Prabhakar Urges RTC Workers to End Strike and Return to Duty
  • ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడి
  • నాలుగు వారాల్లో కమిటీ నివేదిక సమర్పిస్తుందని మంత్రి పొన్నం హామీ
  • 32 డిమాండ్లలో 29 సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టీకరణ
  • సమ్మె వల్ల సామాన్య ప్రజలు, మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడతారని ఆవేదన
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్‌టీసీ) ఉద్యోగులు తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని, ప్రజా సంస్థను కాపాడుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె ఏ సమస్యకూ పరిష్కారం కాదని, ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ పరిశీలన చేస్తోందని, నాలుగు వారాల్లో నివేదిక వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. సంస్థను, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు సమ్మెను విరమించుకోవాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నలుగురు సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని, ఇది కాలయాపన చేసే వ్యూహం కాదని స్పష్టం చేశారు. ఉద్యోగులు లేవనెత్తిన 32 డిమాండ్లలో 29 అంశాలపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని, వాటిని వెంటనే పరిష్కరించవచ్చని తెలిపారు. మిగిలిన ఆర్టీసీ విలీనం, యూనియన్ల గుర్తింపు వంటి అంశాలు సాంకేతిక పరమైనవని, వీటిపై లోతైన పరిశీలన అవసరమని, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు. ఆర్టీసీ విలీనం ఆలస్యమైనప్పటికీ, ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని అన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 2017 పీఆర్సీతో పాటు బకాయిపడ్డ డీఏలను, 2013 నాటి బాండ్లను సైతం పరిష్కరించినట్లు తెలిపారు. రూ.1,205 కోట్లుగా ఉన్న పీఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు, రూ.690 కోట్లుగా ఉన్న సీసీఎస్ బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించామన్నారు. పీఎఫ్, సీసీఎస్ కోసం ప్రతినెలా రూ.75 కోట్లు చెల్లిస్తున్నట్లు చెప్పారు.

పని భారం తగ్గించేందుకు త్వరలోనే 4,538 మంది ఉద్యోగుల నియామకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 1,134 కారుణ్య నియామకాలు చేపట్టామని, గతంలో తొలగించిన 250 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ ప్రస్తుతం కోలుకుంటోందని, ఈ దశలో సమ్మె చేయడం సంస్థకు, ప్రజలకు నష్టం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీపై ఆధారపడి ఉన్నారని, వీరిలో 45 లక్షల మంది మహిళలేనని గుర్తుచేశారు. పేద ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను భరించలేరని, కాబట్టి ప్రజా రవాణాకు ఆటంకం కలిగించకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని, వారికి అండగా ఉంటుందని భరోసా ఇస్తూ, ప్రజలకు అసౌకర్యం కలగకుండా వెంటనే విధుల్లో చేరాలని కోరారు.
Go Back to Shorts
Ponnam Prabhakar
TSRTC strike
RTC employees
Telangana RTC
RTC merger
employee salaries
transport minister
bus services
public transport
employee demands

More Telugu News