మెటాలో మళ్లీ ఉద్యోగాల కోత.. మేలో 8,000 మంది ఇంటికి!

Meta To Lay Off Around 8000 Employees By Next Month says Report
  • మే 20న తొలి విడత లేఆఫ్స్‌కు సిద్ధమైన సోషల్ మీడియా దిగ్గజం మెటా
  • మొదట 8,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు సమాచారం
  • 2022-23 తర్వాత కంపెనీలో ఇదే అతిపెద్ద ఉద్యోగాల కోత
  • ఈ ఏడాది ద్వితీయార్ధంలో మరిన్ని తొలగింపులు ఉండే అవకాశం
సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా మరోసారి భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చేపట్టనున్న తొలగింపుల ప్రక్రియలో భాగంగా తొలి విడత లేఆఫ్స్‌ను మే 20న నిర్వహించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మొదటి రౌండ్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 10% మంది, అంటే దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు మూడు అంతర్గత వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ ఒక కథనాన్ని ప్రచురించింది.

కంపెనీ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీపై వందల బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెడుతున్నారు. ఏఐ ఆధారంగా కంపెనీ పనితీరును సమూలంగా మార్చాలన్న ఆయన వ్యూహంలో భాగంగానే ఈ లేఆఫ్స్ చోటుచేసుకుంటున్నాయి. ఏఐ సాయంతో తక్కువ మంది ఉద్యోగులతో ముఖ్యంగా మేనేజ్‌మెంట్ స్థాయిలను తగ్గించి, అధిక సామర్థ్యం సాధించాలని కంపెనీ భావిస్తోంది. అయితే, ఈ లేఆఫ్‌ల సమయం లేదా వాటి పరిధిపై స్పందించడానికి మేటా నిరాకరించింది.

2022-23 మధ్యకాలంలో "ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ" పేరుతో మెటా సుమారు 21,000 ఉద్యోగాలను తొలగించింది. అప్పట్లో కంపెనీ ఆర్థిక ఇబ్బందులు, షేర్ల పతనం వంటి కారణాలతో ఆ నిర్ణయం తీసుకుంది. కానీ, ప్రస్తుత పరిస్థితి భిన్నం. గతేడాది మెటా 200 బిలియన్ డాలర్ల ఆదాయం, 60 బిలియన్ డాలర్ల లాభం గడించి ఆర్థికంగా పటిష్ఠంగా ఉంది. అయినా సరే, భవిష్యత్ వ్యూహాల్లో భాగంగా ఉద్యోగులను తగ్గించుకోవాలని నిర్ణయించడం గమనార్హం.

ఈ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కంపెనీ అంతర్గతంగా అనేక మార్పులు చేస్తోంది. ఇంజనీర్లను "అప్లైడ్ ఏఐ" అనే కొత్త విభాగానికి బదిలీ చేస్తోంది. అలాగే ఇటీవల ఏర్పాటు చేసిన "మెటా స్మాల్ బిజినెస్" యూనిట్‌లోకి కూడా కొంతమంది సిబ్బందిని మార్చనున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో మరిన్ని లేఆఫ్‌లు ఉండే అవకాశం ఉందని, అయితే వాటి తేదీలు, సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదని నివేదిక పేర్కొంది.

టెక్ రంగంలో ఏఐ కారణంగా ఉద్యోగాల కోత విధించడం ఇదే తొలిసారి కాదు. ఇటీవలే అమెజాన్ 30,000 మందిని, ఫిన్‌టెక్ సంస్థ బ్లాక్ దాదాపు సగం మంది సిబ్బందిని తొలగించాయి. ఇప్పుడు ఈ జాబితాలో మెటా కూడా చేరింది. డిసెంబర్ 31 నాటికి మెటాలో దాదాపు 79,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
Go Back to Shorts
Meta Layoffs
Mark Zuckerberg
Facebook layoffs 2026
artificial intelligence AI
tech industry layoffs
Meta small business
year of efficiency
Meta restructuring
Amazon layoffs
Block layoffs

More Telugu News