ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కొడుకు తీవ్ర ఆందోళన: అంతర్జాతీయ సమాజానికి ఖాసిం ఖాన్ విజ్ఞప్తి!
- తన తండ్రి దాదాపు 11 వందల రోజులుగా జైల్లో ఉన్నారన్న ఖాసిం
- కంటి చూపు క్రమంగా క్షీణిస్తోందని ఆవేదన
- ఆయనను కలిసేందుకు కూడా అనుమతించడం లేదని వెల్లడి
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు ఖాసిం ఖాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి దాదాపు 11 వందల రోజులుగా జైల్లోనే బందీగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన వైద్యం అందక ఆయన కంటి చూపు క్రమంగా క్షీణిస్తోందని సోషల్ మీడియా వేదికగా విలపించారు. తమ కుటుంబానికి లేదా న్యాయవాదులకు ఆయనను కలిసేందుకు కూడా పాక్ అధికారులు అనుమతించడం లేదని తెలిపారు. మార్చి నెల నుంచి తమ తండ్రి గొంతు కూడా వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పాక్ సైన్యం నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను తీవ్రంగా బలహీనపరుస్తోందని ఖాసిం ఆరోపించారు. ప్రతిపక్షాలను పూర్తిగా అణిచివేస్తూ ప్రజల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. తమ తండ్రికి తక్షణమే మెరుగైన వైద్య సదుపాయాలు అందించేలా చొరవ చూపాలని అంతర్జాతీయ సమాజాన్ని, మానవ హక్కుల సంస్థలను ఆయన గట్టిగా కోరారు.
తోషాఖానా అవినీతి కేసులో దోషిగా తేలడంతో ఇమ్రాన్ ఖాన్‌ను 2023 ఆగస్టు 5న అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన రావల్పిండిలోని అడియాలా జైలులో నిర్బంధంలో ఉన్నారు. జైలులో సరైన సమయానికి చికిత్స అందించకపోవడం వల్లే ఆయన కుడి కంటి చూపు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సొంత పార్టీ పి.టి.ఐ వర్గాలు, ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. బ్రిటన్‌లో నివసిస్తున్న ఇమ్రాన్ కుమారులు ఖాసిం ఖాన్, సులేమాన్ ఖాన్‌లు తమ తండ్రి ప్రాణాలకు ముప్పు ఉందంటూ తీవ్ర వేదన వ్యక్తం చేస్తున్నారు.