Balka Suman: 51 రోజులుగా కౌన్సిలర్లను ఊరికి, పండగలకు దూరం చేశారు: బాల్క సుమన్
నేడు జరగనున్న క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి వివేక్ నేరుగా రంగంలోకి దిగి తమ పార్టీ కౌన్సిలర్లను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని, ఒక్కో కౌన్సిలర్‌కు రూ. 3 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపించారు.
క్యాతనపల్లిని రావణకాష్ఠం చేశారని, తమపై రాళ్ల దాడులు చేయించడమే కాకుండా 51 రోజులుగా కౌన్సిలర్లను ఊరికి, పండగలకు దూరం చేశారని బాల్క సుమన్ మండిపడ్డారు. వందలాది మంది పోలీసులను పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ అక్రమాలకు పాల్పడకుండా, ప్రజల తీర్పును గౌరవించాలని అన్నారు. పోలీసుల అండతో అక్రమాలకు పాల్పడితే ఊరుకోబోమని హెచ్చరించారు.
మరోవైపు, ఎన్నికల నేపథ్యంలో క్యాతనపల్లిలో బీఎన్ఎస్ 163 సెక్షన్ అమలులో ఉంది. దాదాపు 650 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో బారికేడ్లు నిర్మించి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు.