Srikanth Reddy: అమరావతిపై చంద్రబాబు మాట తప్పారు: శ్రీకాంత్ రెడ్డి
రాజధానిపై చంద్రబాబు మాట మారుస్తున్నారని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. అమరావతిని రెండేళ్లలో పూర్తి చేస్తానన్న వ్యక్తి, ఇప్పుడు అది 'నిరంతర ప్రక్రియ' అనడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. శ్రీకృష్ణ, శివరామకృష్ణన్ కమిటీలు అమరావతిని రాజధానిగా చెప్పలేదని, కేవలం ఇన్సైడర్ ట్రేడింగ్ కోసమే చంద్రబాబు కమిటీల పేర్లు వాడుతున్నారని ఆరోపించారు.
అమరావతిని 'దేవతల రాజధాని' అంటున్న బాబు, పరమశివుడు తిరుగాడిన కర్నూలుకు హైకోర్టు రాకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రాజెక్టులను తాకట్టు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ భవనం చదరపు అడుగు రూ. 4 వేలకు కడితే, అమరావతిలో రూ. 12 వేలు ఎందుకు ఖర్చు చేస్తున్నారని నిలదీశారు. ప్రస్తుతం ఉన్న నగరాలను ఈ సొమ్ముతో అభివృద్ధి చేస్తే ఎంతో సంపద సృష్టించేవాళ్లమన్నారు. విట్, ఎస్ఆర్ఎం వంటి ప్రైవేటు సంస్థల కోసం వెంపర్లాడే బాబు, జగన్ తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు.
మిగతా రాష్ట్రాల్లాగే మనకూ ఒక మంచి నగరం ఉండాలని వైజాగ్ గురించి జగన్ చెబితే నానా యాగీ చేశారని విమర్శించారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం వంటి నగరాలను తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా చంద్రబాబు పట్టించుకోలేదని మండిపడ్డారు. చట్టబద్ధత పేరుతో అమరావతిని కేంద్రం చేతుల్లో పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు.