Lalit Modi: గోయెంకా తీరు సిగ్గుచేటు.. లక్నో ఓనర్‌ను బ్యాన్ చేయండి: లలిత్ మోదీ

Sanjiv Goenka Behavior Shameful Ban Lucknow Owner Says Lalit Modi
షార్ట్స్‌లో చూడండి
లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) ఓనర్ సంజీవ్ గోయెంకా తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లో జట్టు ఓటమి తర్వాత కెప్టెన్ రిషభ్ పంత్‌తో ఆయన జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తీవ్రంగా స్పందిస్తూ, గోయెంకాను బ్యాన్ చేయాలని, ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని తొలగించాలని డిమాండ్ చేయడం సంచలనం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే... ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్‌లో లక్నో ఓటమి పాలైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో గోయెంకా, కెప్టెన్ రిషభ్ పంత్, కోచ్ జస్టిన్ లాంగర్‌తో సీరియస్‌గా చర్చిస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు, క్రికెట్ అభిమానులు గోయెంకా ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేఎల్ రాహుల్ విషయంలోనూ ఇలాగే ప్రవర్తించిన ఆయన, తన తీరు మార్చుకోలేదని విమర్శించారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా స్పందిస్తూ, టోర్నమెంట్ ఆరంభంలోనే ఇలా ప్రవర్తించడం సరికాదని హితవు పలికారు.

ఈ వివాదంపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటుగా స్పందించారు. "ఈ వ్యక్తి ప్రవర్తన చూసి నాకు చాలా సిగ్గుగా ఉంది. నేను గనుక ఐపీఎల్ ఛైర్మన్‌గా ఉండుంటే, అతడిని వెంటనే బ్యాన్ చేసి, జట్టు యాజమాన్యాన్ని రద్దు చేసేవాడిని. ఫ్రాంచైజీ ఒప్పందంలో ఇందుకు సంబంధించిన క్లాజ్ కూడా ఉంది. బీసీసీఐ వెంటనే చర్యలు తీసుకోవాలి" అని ఆయన పోస్ట్ చేశారు. లలిత్ మోదీ వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత పెద్దదిగా మారింది.

కాగా, 2024 సీజన్‌లోనూ అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో గోయెంకా ఇలాగే మైదానంలో ప్రవర్తించడం పెను దుమారం రేపింది. ఈ సీజన్ ఆరంభానికి ముందు తాను మారుతున్నట్లు చెప్పినప్పటికీ, తొలి మ్యాచ్ ఓటమి తర్వాత మళ్లీ అదే తరహాలో ప్రవర్తించడం విమర్శలకు తావిచ్చింది. 

అయితే, సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం దీనిపై స్పందించింది. బయట ప్రచారం జరుగుతున్నట్లుగా అక్కడ సీరియస్ చర్చ ఏమీ జరగలేదని, అదొక సాధారణ సంభాషణ మాత్రమేనని పేర్కొంటూ ఒక వీడియోను తమ అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. యాజమాన్యం వివరణ ఇచ్చినప్పటికీ, గోయెంకా ప్రవర్తనపై విమర్శలు మాత్రం ఆగడం లేదు.
Go Back to Shorts
Lalit Modi
Sanjiv Goenka
LSG Owner
Lucknow Super Giants
IPL Controversy
KL Rahul
Rishabh Pant
Justin Langer
IPL 2026

More Telugu News