Steve Smith: స్టీవ్ స్మిత్‌కు జాక్‌పాట్.. ఒక్కరోజే రూ.13 కోట్లకు పైగా లాభం!

Steve Smith Gains Millions from Koala Investment
షార్ట్స్‌లో చూడండి
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ మైదానంలో పరుగుల వరద పారించడమే కాదు, వ్యాపార రంగంలోనూ అద్భుతాలు చేస్తున్నాడు. తాజాగా ఆన్‌లైన్ ఫర్నిచర్ సంస్థ 'కోలా'లో పెట్టిన పెట్టుబడి ద్వారా ఒక్క రోజులోనే భారీ లాభాలను ఆర్జించాడు. మంగళవారం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఈ కంపెనీ షేర్ల విలువ పెరగడంతో స్మిత్ సంపద ఒక్కరోజే 1.4 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 13.07 కోట్లు) పైగా పెరిగింది.

వివరాల్లోకి వెళితే... స్మిత్ 2015లో 'కోలా' కంపెనీలో కేవలం 1,00,000 డాలర్లు పెట్టుబడిగా పెట్టి 10 శాతం వాటాను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఈ కంపెనీలో ఆయనకు 3.9 శాతం వాటా ఉంది. కంపెనీ ఆస్ట్రేలియన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయినప్పుడు స్మిత్ వాటా విలువ 11.9 మిలియన్ డాలర్లు కాగా, ట్రేడింగ్ ముగిసే సమయానికి అది 13.2 మిలియన్ డాలర్లకు చేరింది. ఈ క్రమంలోనే ఆయన ఒక్కరోజులో భారీ మొత్తం ఆర్జించాడు.

స్మిత్ ఇలా పెట్టుబడులు పెట్టడం కొత్తేమీ కాదు. డిజిటల్ కరెన్సీ, విలువైన లోహాలలో పెట్టుబడులు పెట్టే 'బాంబూ' అనే ఫిన్‌టెక్ యాప్‌కు ఆయన అంబాసిడర్‌గా ఉన్నాడు. అంతేగాక‌ 'ఓట్ మిల్క్ గుడ్‌నెస్' అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా, 'స్నాపర్' అనే ఆన్‌లైన్ ఫోటోగ్రఫీ మార్కెట్‌ప్లేస్‌లోనూ తొలినాళ్లలో పెట్టుబడులు పెట్టాడు.

ఇక క్రికెట్ విషయానికొస్తే, వచ్చే ఏడాది (2027) జనవరిలో భారత్‌లో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) దృష్టి సారించింది. స్మిత్, కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్ వంటి సీనియర్ ఆటగాళ్లకు భారత్‌లో సిరీస్ గెలవడం ఒక కలగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌ను సీఏ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈ కీలక సిరీస్‌కు ఆటగాళ్లను తాజాగా ఉంచేందుకు స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్‌లను ఐపీఎల్ తొలి కొన్ని మ్యాచ్‌లకు దూరం పెట్టింది.
Go Back to Shorts
Steve Smith
Steve Smith investment
Koala shares
Australian Stock Exchange
Border Gavaskar Trophy
Cricket Australia
Pat Cummins
Josh Hazlewood
India tour

More Telugu News