Harish Kumar Gupta: ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ.. ఏపీకే ఫైల్స్‌పై ఏపీ డీజీపీ తీవ్ర హెచ్చరిక

Andhra Pradesh DGP Harish Kumar Gupta alerts on APK file scams
షార్ట్స్‌లో చూడండి
యాండ్రాయిడ్‌ ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులు క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా హెచ్చరించారు. ముఖ్యంగా ‘ఏపీకే ఫైళ్ల’ రూపంలో వస్తున్న కొత్త తరహా సైబర్ మోసాల పట్ల జాగ్రత్త వహించాలని కోరుతూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

సైబర్ నేరగాళ్లు ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని డీజీపీ తెలిపారు. ‘గ్యాస్‌ కనెక్షన్‌ రీ-కేవైసీ చేయాలని, ప్రభుత్వ పథకాలకు అర్హులయ్యారని నమ్మించి ఏపీకే ఫైళ్లు డౌన్‌లోడ్‌ చేయిస్తారు. ఆ తర్వాత మీ వ్యక్తిగత, బ్యాంకు వివరాలు సేకరించి ఫోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటారు. వెంటనే బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మొత్తం కాజేస్తారు’ అని ఆయన వివరించారు. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చే ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయవద్దని సూచించారు. ఒకసారి ఈ ఫైల్స్ ఇన్‌స్టాల్ చేస్తే ఫోన్‌లోని ఎస్ఎంఎస్‌లు, కాంటాక్టులు, పాస్‌వర్డ్‌లు నేరగాళ్ల చేతికి చిక్కుతాయన్నారు.

పొరపాటున ఎవరైనా ఇలాంటి మాల్వేర్ ఇన్‌స్టాల్ చేస్తే వెంటనే ఫోన్‌ను రీబూట్ చేయాలని సూచించారు. అలాగే, ఫోన్‌ సెట్టింగ్స్‌లో ‘ఇన్‌స్టాల్‌ ఫ్రమ్‌ అన్నోన్‌ సోర్సెస్‌’ ఆప్షన్‌ను డిజేబుల్ చేసుకోవడం సురక్షితమని తెలిపారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో ఎవరైనా వీడియో కాల్ చేసి బెదిరిస్తే భయపడవద్దని, మన దేశ చట్టాల్లో అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ఎవరైనా మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
 
Go Back to Shorts
Harish Kumar Gupta
APK files
Andhra Pradesh DGP
cyber crime
online fraud
digital arrest
cyber security
AP police
1930 toll free number
malware

More Telugu News