Rohit Reddy: ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం.. స్విమ్మింగ్ పూల్‌‌లో డ్రగ్స్!

Rohit Reddy Farmhouse Drugs Case New Angle Drugs in Swimming Pool
షార్ట్స్‌లో చూడండి
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతమైంది. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో నిందితులు డ్రగ్స్‌ను పడేసి ఉంటారన్న అనుమానంతో పోలీసులు నీటి నమూనాలను సేకరించారు. సోదాల సమయంలో కాల్పులు జరిపి, ఆ గందరగోళంలో సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఈ కోణంలోనే స్నిఫర్ డాగ్స్ సాయంతో ఫామ్‌హౌస్‌లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

సిట్ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు చెప్పినట్టుగా డ్రగ్స్‌ను సిమ్లా నుంచి కాకుండా, హైదరాబాద్‌కు చెందిన అభిషేక్ సింగ్ అనే పెడ్లర్ నుంచే కొనుగోలు చేసినట్టు తేలింది. రోహిత్‌రెడ్డి డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడు శరత్ ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో ఆయన కూడా నిందితుడిగా ఉన్నారు. అంతేకాకుండా, నిందితుల రక్త నమూనాల్లో కొకైన్, మెథాయాంఫెటమైన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

మరోవైపు, రోహిత్‌రెడ్డి, రితేశ్ రెడ్డి, అమిత్ శర్మల కస్టడీ పిటిషన్‌పై ఉప్పర్‌పల్లి కోర్టులో వాదనలు జరిగాయి. మఫ్టీలో ఉన్న పోలీసులను చూసి భయంతోనే కాల్పులు జరిపామని నిందితుల తరఫు న్యాయవాది వాదించగా, డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు పది రోజుల కస్టడీ అవసరమని పోలీసులు కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, తీర్పును మార్చి 20వ తేదీకి వాయిదా వేశారు.

ఇదిలా ఉండగా, ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న రోహిత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుతం సిట్ అధికారులు బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి,  పుప్పాలగూడకు చెందిన వ్యాపారి తిరువీధుల అర్జున్‌రెడ్డి, వరమాచినేని శ్రవణ్‌కుమార్, సిలివేరి శరత్‌ను బుధవారం శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారించారు. నిందితుల్లో కొందరిని నేడు (గురువారం) కూడా విచారించనున్నారు.
Go Back to Shorts
Rohit Reddy
Moinabad drugs case
farmhouse drugs
Hyderabad drugs
drug peddler Abhishek Singh
swimming pool drugs
Telangana drugs
drug investigation
BRS party

More Telugu News