Naveen-ul-Haq: ఇజ్రాయెల్‌కు, పాక్‌కు తేడా లేదు.. ఆఫ్ఘన్ క్రికెటర్ నవీన్ ఉల్ హక్!

Naveen ul Haq says No Difference Between Israel and Pakistan
షార్ట్స్‌లో చూడండి
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌‌లోని మాదకద్రవ్య బాధితుల పునరావాస కేంద్రం‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిపై ఆఫ్ఘన్ క్రికెటర్ నవీనుల్ హక్ తీవ్రంగా స్పందించాడు. ఈ సందర్భంగా ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా జరుపుతున్న దాడులను ప్రస్తావిస్తూ.. ఇజ్రాయెల్.. పాకిస్థాన్ మధ్య తేడాను గుర్తించడం చాలా కష్టంగా ఉందంటూ తన ఫేస్‌బుక్ వాల్‌పై నవీన్ ఘాటుగా స్పందించాడు. అమాయక ప్రజల ప్రాణాలు తీయడంలో రెండు దేశాల తీరు ఒకేలా ఉందన్నది ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

మరో స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ కూడా ఈ దాడులను తీవ్రంగా ఖండించాడు. పౌరుల నివాసాలు, విద్యాసంస్థలు, వైద్య కేంద్రాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం 'యుద్ధ నేరం' అని పేర్కొన్నాడు. రంజాన్ మాసంలో మానవత్వానికి విరుద్ధంగా జరుగుతున్న ఇలాంటి దాడులు విద్వేషాన్ని పెంచుతాయని, ఐక్యరాజ్యసమితి దీనిపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశాడు. "మేము ఒక జాతిగా మళ్ళీ కోలుకుంటాం.. ఇన్షా అల్లాహ్" అంటూ తన దేశ ప్రజలకు బాసటగా నిలిచాడు.

మరో స్టార్ క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్ అంతర్జాతీయ సమాజం మౌనాన్ని ప్రశ్నించాడు. "ఆసుపత్రిపై బాంబులు వేసినా అంతర్జాతీయ చట్టాలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? మానవత్వం ఏమైపోయింది?" అంటూ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలోనూ పాక్ జరిపిన దాడుల్లో ముగ్గురు దేశవాళీ క్రికెటర్లు మరణించారని, అందుకే పాకిస్థాన్‌తో త్రైపాక్షిక సిరీస్ నుంచి ఆఫ్ఘన్ తప్పుకుందని ఆయన గుర్తు చేశాడు.

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాకిస్థాన్‌తో సరిహద్దు వివాదాలు ముదిరాయి. తమ దేశంలో దాడులకు పాల్పడుతున్న టీటీపీ ఉగ్రవాదులకు అఫ్ఘన్ ఆశ్రయం ఇస్తోందని పాక్ ఆరోపిస్తుండగా.. ఐసిస్ ఉగ్రవాదులకు పాక్ అండగా నిలుస్తోందని తాలిబన్లు ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఈ రాజకీయ వైరం ఇప్పుడు అమాయక పౌరుల ప్రాణాల మీదకు రావడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Go Back to Shorts
Naveen-ul-Haq
Naveen ul Haq
Afghanistan
Pakistan airstrike
Kabul hospital attack
Rashid Khan
Rahmanullah Gurbaz
Taliban
Afghanistan Pakistan relations
cricket

More Telugu News