Jio Payments Bank: ఇక ఏటీఎం కార్డు అవసరం లేదు.. యూపీఐతో క్యాష్ ఇచ్చేస్తున్న జియో

Jio Payments Bank Introduces UPI Cash Withdrawal No ATM Card Needed
షార్ట్స్‌లో చూడండి
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ అయిన జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (JPBL), దేశంలో ఓ కీలకమైన కొత్త సేవను ప్రారంభించింది. ఇకపై డెబిట్ కార్డు లేదా ఏటీఎంలతో సంబంధం లేకుండా యూపీఐ ద్వారా నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. తన బిజినెస్ కరస్పాండెంట్ (BC) నెట్‌వర్క్ ద్వారా ఈ సేవలను అందించనుంది.

ఈ సేవను వినియోగించుకోవాలనుకునే కస్టమర్లు తమకు సమీపంలోని జియో బిజినెస్ కరస్పాండెంట్ వద్దకు వెళ్లాలి. అక్కడ ఉన్న యూపీఐ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, తమ యూపీఐ యాప్ ద్వారా లావాదేవీని ఆమోదించాలి. అనంతరం కరస్పాండెంట్ వారికి కావాల్సిన నగదును అందజేస్తారు. ఈ విధానం ద్వారా కార్డులు అవసరం లేకపోవడంతో పాటు ఏటీఎంల కోసం వెతకాల్సిన పని తప్పుతుంది.

గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల ప్రజలే లక్ష్యం
ముఖ్యంగా గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లోని కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఈ సేవను ప్రవేశపెట్టారు. డిజిటల్ చెల్లింపులకు కొత్తగా అలవాటు పడుతున్న వారికి, కార్డులు లేని వారికి నగదు అందుబాటులోకి తీసుకురావడమే దీని ఉద్దేశం. డిజిటల్ చెల్లింపులకు, భౌతిక నగదుకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది. భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయడంలో, ఆర్థిక సేవలను అందరికీ చేరువ చేయడంలో భాగంగానే ఈ చొరవ తీసుకున్నట్లు జియో పేమెంట్స్ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది.

కాగా, ఆర్‌బీఐ ఆమోదంతో 2016 నవంబర్‌లో జియో పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా వ్యక్తులు, వ్యాపారాల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది.
Go Back to Shorts
Jio Payments Bank
UPI cash withdrawal
Jio Financial Services
digital payments
business correspondent network
rural India
semi-urban areas
RBI
digital banking

More Telugu News