1998లోనే భారత్‌ను టార్గెట్ చేసిన లాడెన్.. బయటపడ్డ సీఐఏ రహస్యాలు

1998లోనే భారత్‌ను టార్గెట్ చేసిన లాడెన్.. బయటపడ్డ సీఐఏ రహస్యాలు

Osama bin Laden targeted India in 1998 CIA secret documents reveal
  • 1998లోనే భారత్‌పై దాడికి ఒసామా బిన్ లాడెన్ ప్లాన్ 
  • సీఐఏ విడుదల చేసిన రహస్య పత్రాల ద్వారా వెల్లడి
  • లాడెన్‌ను అప్పగించేందుకు తాలిబన్ల నిరాకరణ
  • లాడెన్ నెట్‌వర్క్‌కు పాకిస్థాన్‌తో ఉన్న సంబంధాలపై కీలక వివరాలు
  • 9/11 దాడుల 25వ సంస్మరణ దినం సందర్భంగా పత్రాలు విడుదల
అల్ ఖైదా వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్.. భారత్‌పై కూడా దాడులకు ప్లాన్ చేసినట్లు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 1998లోనే ఈ కుట్రకు పథకం రచించినట్లు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తాజాగా విడుదల చేసిన రహస్య పత్రాల ద్వారా బయటపడింది. అమెరికాపై 9/11 దాడులు జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ ఈ పత్రాలను బహిర్గతం చేశారు.

1998 ఆగస్టు 28 నాటి సీఐఏ నిఘా నివేదిక ప్రకారం, ఒసామా బిన్ లాడెన్ దాడులు జరపాలనుకుంటున్న దేశాల జాబితాలో భారత్ పేరు కూడా ఉంది. ఈ జాబితాలో పాకిస్థాన్, ఈజిప్ట్, అరేబియన్ ద్వీపకల్పంలోని దేశాలు, ఉగాండా, నైజీరియా ఉన్నాయి. అయితే, ఆ పత్రాల్లో భారత్‌లో ఎక్కడ దాడి చేయాలనుకున్నారు? ఎప్పుడు చేయాలనుకున్నారు? వంటి నిర్దిష్ట వివరాలు మాత్రం లేవు. "బిన్ లాడెన్ టెర్రరిస్ట్ నెట్‌వర్క్ స్టిల్ ఏ థ్రెట్" అనే పేరుతో ఉన్న ఈ నివేదిక, అమెరికా దాడుల తర్వాత కూడా లాడెన్ నెట్‌వర్క్ చెక్కుచెదరలేదని పేర్కొంది.

ఈ పత్రాల్లో లాడెన్‌కు, పాకిస్థాన్‌కు మధ్య ఉన్న సంబంధాలు, తాలిబన్ల వైఖరిపై కూడా కీలక వివరాలు ఉన్నాయి. సౌదీ, యూఏఈ దేశాలు లాడెన్‌ను తమకు అప్పగించాలని కోరినా, అఫ్గానిస్థాన్ నుంచి అతడిని పంపించేందుకు తాలిబన్లు నిరాకరించినట్లు 2000 జనవరి నాటి నివేదిక స్పష్టం చేస్తోంది. కాందహార్ విమానం హైజాక్ ఘటన వెనుక ఇస్లామాబాద్ పాత్రపై అంతర్జాతీయంగా అనుమానాలు వ్యక్తమైనట్లు కూడా ఈ నివేదికలో ఉంది.

అదే సమయంలో, అంతర్జాతీయ ఒత్తిడి, దేశంలో మతవాదుల వల్ల ఎదురయ్యే ముప్పు కారణంగా పాకిస్థాన్ లాడెన్ నెట్‌వర్క్‌పై కొన్ని చర్యలు తీసుకున్నట్లు 2000 జూన్ నాటి బ్రీఫింగ్‌లో ఉంది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే హర్కత్ ఉల్-అన్సార్ వంటి ఉగ్రవాద సంస్థలు 1998లోనే అమెరికాపై దాడులు చేయాలన్న లాడెన్ ఫత్వాకు మద్దతు పలికినట్లు కూడా ఈ పత్రాలు వెల్లడించాయి. ఈ పత్రాల విడుదల ద్వారా 9/11 దాడులకు ముందు నాటి పరిస్థితులు, లాడెన్ నెట్‌వర్క్ ఎంత బలంగా ఉందో మరోసారి స్పష్టమైంది.
Advertisement
Osama bin Laden
CIA declassified documents
India terror plot 1998
Al Qaeda network
John Ratcliffe CIA
International terrorism

More Telugu News