Abhishek Sharma: దారుణంగా ఆడుతున్న అభిషేక్ శర్మ.. ఫైనల్లో తుది జట్టులో ఉంటాడా..?

Abhishek Sharmas Poor Form Questioned Before Final
  • వరుస వైఫల్యాలతో నిరాశపరుస్తున్న ఓపెనర్ అభిషేక్ శర్మ
  • ఫైనల్లో అభిషేక్ స్థానంలో రింకూ సింగ్‌ను తీసుకోవాలంటూ డిమాండ్
  • ఫామ్ లేని ప్లేయర్‌తో రిస్క్ చేయొద్దంటున్న నెటిజన్లు
  • ఆదివారం అహ్మదాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్
టీ20 ప్రపంచకప్ 2026 తుది దశకు చేరుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా కూర్పుపై, ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానంపై తీవ్ర చర్చ నడుస్తోంది. టోర్నీ ఆసాంతం అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, ఫైనల్ కోసం అతన్ని కొనసాగించాలా? లేక డేరింగ్ నిర్ణయం తీసుకొని ఫినిషర్ రింకూ సింగ్‌ను జట్టులోకి తీసుకోవాలా? అనే ప్రశ్న ఇప్పుడు అభిమానులను, విశ్లేషకులను తొలుస్తోంది.

ఈ టోర్నీలో అభిషేక్ గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ లలో అతను కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో జింబాబ్వేపై చేసిన ఒక అర్ధసెంచరీ (55) మినహా.. మిగతా మ్యాచుల్లో 0, 0, 0, 15, 10, 9 స్కోర్లకే పరిమితమయ్యాడు. అతని సగటు కేవలం 12.71 మాత్రమే ఉండటం గమనార్హం. దీంతో కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో ఇలాంటి ఫామ్ లేని ఆటగాడిని నమ్ముకోవడం రిస్క్ అవుతుందని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

"నిలకడగా విఫలమవుతున్న ఆటగాడితో ఫైనల్ మ్యాచ్‌లో ప్రయోగం చేయకూడదు. రింకూ సింగ్ వంటి మ్యాచ్ విన్నర్‌ను తీసుకోవాలి" అని ఒక అభిమాని కామెంట్ చేయగా, "అభిషేక్ ఆటతీరును ప్రత్యర్థులు పసిగట్టారు, కివీస్ బౌలర్లు అతన్ని సులభంగా కట్టడి చేస్తారు" అని మరొకరు విశ్లేషించారు. అయితే మరికొందరు మాత్రం అభిషేక్ ఫైనల్లో 'ఎక్స్ ఫ్యాక్టర్'గా మారతాడని, కీలక సమయంలో భారీ ఇన్నింగ్స్ ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ ముందు పెద్ద సవాల్ ఉంది. విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగిస్తారా? లేక ట్రోఫీ కోసం కఠిన నిర్ణయం తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. దాదాపుగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తున్నా, ఫైనల్ ఒత్తిడి దృష్ట్యా రింకూ సింగ్ పేరును పరిశీలించే అవకాశం లేకపోలేదు.
Abhishek Sharma
T20 World Cup 2026
India vs New Zealand
Rinku Singh
Suryakumar Yadav
Gautam Gambhir
India Cricket Team
Cricket Final
Team India
Ahmedabad

More Telugu News