Vijayasai Reddy: భారతీయ క్రియేటర్ల శ్రమను దోచుకుంటున్నారు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy Slams Exploitation of Indian Creators
  • ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు మన క్రియేటర్లను దోచుకుంటున్నాయన్న విజయసాయి
  • ఇన్‌స్టాగ్రామ్ ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని మండిపాటు
  • మనకు ఒక స్వదేశీ సోషల్ మీడియా యాప్ ఉండాలని వ్యాఖ్య

సోషల్ మీడియా వేదికలపై రాత్రింబవళ్లు శ్రమించి కంటెంట్‌ను సృష్టిస్తున్న భారతీయ క్రియేటర్లకు దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కడం లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి అంతర్జాతీయ సంస్థలు భారతీయుల ప్రతిభను తక్కువ ధరకు వాడుకుంటూ, ప్రకటనల ద్వారా వచ్చే భారీ ఆదాయాన్ని తమ జేబుల్లో వేసుకుంటున్నాయని మండిపడ్డారు.


యూట్యూబ్ వంటి సంస్థలు ప్రకటనల ఆదాయంలో 55 శాతం క్రియేటర్లకు ఇస్తుండగా, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లు క్రియేటర్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. విదేశీ సంస్థలు తమ ధోరణిని మార్చుకోని పక్షంలో, భారతదేశానికే సొంతంగా ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఉండాలని ఆయన ప్రతిపాదించారు. 'భారత్ టాక్సీ' లాంటి స్వదేశీ ప్రత్యామ్నాయాల మాదిరి, ఒక స్వదేశీ సోషల్ మీడియా యాప్ ఉంటే మన దేశ సంపద విదేశాలకు పోకుండా ఉండటమే కాకుండా, క్రియేటర్లకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.


ఈ సమస్యపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తక్షణమే జోక్యం చేసుకోవాలని విజయసాయి రెడ్డి కోరారు. గతంలో అశ్వినీ వైష్ణవ్ క్రియేటర్ల పక్షాన మాట్లాడిన విషయాన్ని గుర్తుచేస్తూ, వారి ఆర్థిక భద్రత, హక్కుల కోసం కఠినమైన చట్టబద్ధ నిబంధనలు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.


భారతీయ క్రియేటర్ల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వ రంగంలో లేదా స్వదేశీ భాగస్వామ్యంతో కొత్త ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ ఇండియాలో క్రియేటర్లే వెన్నెముక అని, వారి హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.

Vijayasai Reddy
Indian Creators
Social Media Platforms
YouTube
Instagram
Ashwini Vaishnaw
Digital India
Creators Rights
Indian Social Media App

More Telugu News