Lebanon: లెబనాన్‌లోని భారతీయులకు అత్యవసర హెచ్చరిక: ప్రయాణాలు మానుకోవాలని ఎంబసీ సూచన

Lebanon Indian Embassy Issues Urgent Advisory Amid Tensions
  • ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు
  • లెబనాన్‌లోని భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు
  • అవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని హెచ్చరిక
  • అత్యవసర సేవల కోసం ప్రత్యేక ఫోన్ నంబర్, ఈమెయిల్ జారీ
ఇరాన్ పై ఇజ్రాయెల్-అమెరికా దాడులతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో, లెబనాన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులను అప్రమత్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, భారతీయులు అనవసర ప్రయాణాలను మానుకోవాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ స్థానిక యంత్రాంగం జారీ చేసే భద్రతా సూచనలను కచ్చితంగా పాటించాలని ఆదివారం ఒక ప్రకటనలో సూచించింది.

లెబనాన్‌లోని భారతీయులు ఎవరైనా అత్యవసర సహాయం కోసం ఎంబసీని సంప్రదించవచ్చని తెలిపింది. ఇందుకోసం 96176860128 మొబైల్ నంబర్ లేదా [email protected] మెయిల్ ఐడీని అందుబాటులో ఉంచింది. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే ఈ నంబర్లను సంప్రదించాలని కోరింది.

మరోవైపు... ఇరాన్, గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను పెంచకుండా సమస్యలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని భారత విదేశాంగ శాఖ కోరింది. పౌరుల భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

కేవలం లెబనాన్ మాత్రమే కాకుండా.. ఇరాన్, ఖతార్, యూఏఈ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు కూడా అక్కడి భారతీయులకు హెచ్చరికలు జారీ చేశాయి. ఇరాన్‌లోని భారతీయులు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, అనవసరంగా బయట తిరగవద్దని టెహ్రాన్‌లోని ఎంబసీ సూచించింది. ఖతార్, యూఏఈలలో కూడా భారతీయులు స్థానిక అధికారుల హెచ్చరికలు గమనిస్తూ, సైనిక స్థావరాలకు దూరంగా ఉండాలని ఆయా ఎంబసీలు స్పష్టం చేశాయి. ఆయా ప్రాంతాల్లోని మిషన్లు భారతీయులతో నిరంతరం టచ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు.


Lebanon
Lebanon travel advisory
Indian Embassy Lebanon
India Iran tension
Israel Iran conflict
Middle East crisis
travel warning
Beirut
Randhir Jaiswal
Iran

More Telugu News