Sahibzada Farhan: కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన పాక్ బ్యాటర్ ఫర్హాన్

Sahibzada Farhan Breaks Virat Kohlis Record
  • టీ20 ప్రపంచకప్ చరిత్రలో సాహిబ్జాదా ఫర్హాన్ రికార్డు
  • ఒకే ఎడిషన్‌లో విరాట్ కోహ్లీ చేసిన 319 పరుగుల రికార్డు బ్రేక్
  • శ్రీలంకతో మ్యాచ్‌లో బౌండరీతో మైలురాయిని దాటిన పాక్ ఓపెనర్
  • సెమీస్ చేరాలంటే పాకిస్థాన్ 64 పరుగుల తేడాతో గెలవాల్సిందే
  • కీలక మ్యాచ్‌లో బాబర్ అజామ్ ను పక్కనపెట్టిన పాక్ మేనేజ్‌మెంట్
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న సుదీర్ఘ రికార్డును ఫర్హాన్ బద్దలు కొట్టాడు. సూపర్-8 రౌండ్‌లో భాగంగా శనివారం పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ ఈ ఘనత సాధించాడు.

2014 టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ అత్యద్భుత ప్రదర్శనతో 319 పరుగులు చేసి రికార్డు సృష్టించగా, 12 ఏళ్ల తర్వాత ఫర్హాన్ దాన్ని అధిగమించాడు. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఫర్హాన్ ఈ రికార్డుకు 37 పరుగుల దూరంలో నిలిచాడు. 

ఇవాళ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఫర్హాన్.. ఆరో ఓవర్ ఆరంభంలో దసున్ షనక బౌలింగ్‌లో ఫోర్ కొట్టి కోహ్లీ రికార్డును దాటేశాడు. ఈ టోర్నీలో ఫర్హాన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. నమీబియాపై సెంచరీ, ఇంగ్లండ్‌పై హాఫ్ సెంచరీతో రాణించాడు. కేవలం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ కోసం పాక్ జట్టులో సంచలనం నిర్ణయాలు తీసుకున్నారు. స్టార్ ఆటగాడు బాబర్ అజామ్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జాలను పక్కనపెట్టి.. వారి స్థానాల్లో నసీమ్ షా, ఖ్వాజా నఫే, అబ్రార్ అహ్మద్‌లను తుది జట్టులోకి తీసుకున్నారు.

శ్రీలంక ఇప్పటికే ఇంగ్లండ్, న్యూజిలాండ్ చేతిలో ఓడి సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. మరోవైపు పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై కనీసం 64 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంది. అప్పుడే న్యూజిలాండ్ రన్ రేట్‌ ను దాటి పాక్ ముందంజ వేయగలుగుతుంది.
Sahibzada Farhan
Farhan
Virat Kohli
Pakistan Cricket
T20 World Cup 2026
ICC
Sri Lanka
Babar Azam
Cricket Records
T20 Records

More Telugu News