Muppidi Avinash Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. ముప్పిడి అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Muppidi Avinash Reddy Faces Setback in AP Liquor Scam Case at Supreme Court
  • లిక్కర్ స్కామ్ కేసులో ఏ-7గా ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డి
  • ప్రస్తుతం శ్రీలంకలో తలదాచుకున్న వైనం
  • ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
  • ఈ నెల 26లోపు విచారణాధికారి ముందు లొంగిపోవాలని ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ నిరాశ ఎదురైంది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. చట్టం నుంచి తప్పించుకుని విదేశాల్లో తలదాచుకున్నా ప్రయోజనం లేదని, తక్షణమే విచారణకు సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది.


ఈరోజు జరిగిన విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ముప్పిడి అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పడమే కాకుండా, ఈ నెల 26వ తేదీ లోపు సంబంధిత విచారణాధికారి ముందు స్వయంగా హాజరై లొంగిపోవాలని డెడ్ లైన్ విధించింది. చట్టం ముందు లొంగిపోయిన తర్వాతే నిబంధనల ప్రకారం సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.


ఈ కేసు మూలాలు అంతర్జాతీయంగా విస్తరించాయని సుప్రీంకోర్టు గతంలోనే అనుమానం వ్యక్తం చేసింది. లిక్కర్ స్కామ్ ద్వారా అక్రమంగా ఆర్జించిన కోట్లాది రూపాయలను అవినాశ్ రెడ్డి ద్వారా రాజ్ కెసిరెడ్డి విదేశాల్లో దాచారనే ఆరోపణలపై ధర్మాసనం దృష్టిసారించింది. స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అవినాశ్ రెడ్డి శ్రీలంకలో తలదాచుకున్నట్లు దర్యాప్తులో తేలింది.


సుప్రీంకోర్టులో బెయిల్ దక్కకపోవడంతో, ఇప్పుడు అవినాశ్ రెడ్డి లొంగిపోవడం మినహా మరో మార్గం లేదు. ఆయన లొంగిపోయిన తర్వాత జరిపే విచారణలో మరికొంత మంది రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

Muppidi Avinash Reddy
AP Liquor Scam
Andhra Pradesh
Liquor Scam Case
Supreme Court
Bail Petition
Raj Kesireddy
Sri Lanka

More Telugu News