Priyanka Chopra: 'వారణాసి'కి విరామం.. హైదరాబాద్ నుంచి ప్రియాంక ఏం తీసుకెళ్లారంటే?

Priyanka Chopra Takes Bun Maska from Hyderabad Varanasi Movie Set
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కలిసి నటిస్తున్న చిత్రం 'వారణాసి'. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన హైదరాబాద్ షెడ్యూల్‌ను ప్రియాంక పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ, హైదరాబాద్ నుంచి ఓ ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని తనతో పాటు తీసుకెళుతున్నట్లు తెలిపారు.

షెడ్యూల్ ముగియడంతో లాస్ ఏంజిల్స్‌కు బయల్దేరిన ప్రియాంక, ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ ఇక్కడి ఫేమస్ 'బన్ మస్కా' చిత్రాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. "హైదరాబాద్ నుంచి ఓ భాగాన్ని నాతో తీసుకెళుతున్నా. త్వరలో కలుద్దాం" అని దానికి క్యాప్షన్ జోడించారు. తాను నటించిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ది బ్లఫ్' ప్రమోషన్స్ కోసం లాస్ ఏంజిల్స్ వెళుతున్నట్లు మరో పోస్టులో ఆమె స్పష్టం చేశారు. ఆ ప్రచార కార్యక్రమాలు ముగిసిన వెంటనే తిరిగి 'వారణాసి' సెట్స్‌లో జాయిన్ అవుతానని తెలిపారు.

చాలా కాలం తర్వాత ప్రియాంక భారతీయ సినిమాలో నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. 'వారణాసి'లో ఆమె 'మందాకిని' అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లలో పసుపు చీరలో పిస్టల్ పట్టుకుని ఉన్న ఆమె లుక్ ఆకట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మహేష్ బాబు 'రుద్ర'గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ'గా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ప్రియాంక నటనపై ఆమె సహనటుడు మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. 'ది బ్లఫ్' ట్రైలర్ చూసిన ఆయన, అందులో పీసీ నటన గురించి ఆసక్తికరంగా స్పందించారు. "ట్రైలర్ నచ్చింది. ప్రియాంక మరోసారి రాజీపడని, దృఢమైన నటన కనబరిచారు" అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 25న విడుదల కానున్న ఈ చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రుస్సో బ్రదర్స్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ నిర్మిస్తున్న 'ది బ్లఫ్' చిత్రంలో ప్రియాంక 'ఎర్సెల్ బోడెన్' అనే పైరేట్ పాత్రలో కనిపించనున్నారు.
Go Back to Shorts
Priyanka Chopra
Mahesh Babu
Varanasi Movie
SS Rajamouli
The Bluff Movie
Hyderabad Schedule
Bollywood
Tollywood
Prithviraj Sukumaran
Russo Brothers

More Telugu News