హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు... ముంబైకి దారి మళ్లింపు
- జెడ్డా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానం
- మానవ బాంబు ఉన్నట్లు బెదిరింపు మెయిల్
- ఎల్‌టీటీఈ, ఐఎస్ఐ ఈ దాడికి ప్రణాళిక వేశాయని మెయిల్
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విమానాశ్రయ అధికారులకు శనివారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌లో జెడ్డా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో మానవ బాంబు ఉన్నట్లు రాసి ఉందని తెలిపారు.
1984లో మద్రాస్ విమానాశ్రయంలో జరిగిన బాంబు దాడి తరహాలో ఈ దాడి జరుగుతుందని, ఎల్‌టీటీఈ, ఐఎస్ఐ ఈ దాడికి ప్రణాళిక వేశాయని ఆ మెయిల్‌లో పేర్కొన్నట్లు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు పైలట్‌కు సమాచారం అందించారు. విమానాన్ని ముంబైలో ల్యాండ్ చేయాలని సూచించారు.