సుగాలి ప్రీతి కేసులో కీలక పరిణామం.. మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్
- సుగాలి ప్రీతి కేసులో కీలక ముందడుగు
- దర్యాప్తును సీబీఐకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం
- ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన హోమ్ శాఖ
- గతంలో హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్
- హామీ మేరకు దర్యాప్తు బదిలీ చేస్తూ నిర్ణయం
వివరాల్లోకి వెళితే... 2017 ఆగస్టులో కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో సుగాలి ప్రీతి మృతికి సంబంధించి కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, అనేక అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్లు బలంగా వినిపించాయి.
కాగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో ఇచ్చిన హామీ మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలుస్తామని, ఈ కేసును సీబీఐకి అప్పగించి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తామని ఆయన గతంలో పలు సందర్భాల్లో భరోసా ఇచ్చారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ హామీని నెరవేరుస్తూ దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయడం గమనార్హం. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను రాష్ట్ర పోలీసులు సీబీఐకి అందజేయనున్నారు.