గిల్‌కు బదులు కోహ్లీ ఆడి ఉంటే సెంచరీ చేసేవాడు: మంజ్రేకర్
- గిల్ అనవసర దూకుడు కట్టిపెట్టాలన్న మంజ్రేకర్
- విరాట్ కోహ్లీలా ఒక బ్రాండ్‌గా మారే ప్రయత్నం చేయొద్దని హితవు
- తన బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాలన్న మాజీ క్రికెటర్
లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో గిల్, క్రాలీ మధ్య జరిగిన వాగ్వాదం ఇంగ్లండ్ జట్టును ఉత్తేజపరిచి, కెప్టెన్ బెన్ స్టోక్స్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనకు ప్రేరణగా నిలిచిందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. "శుభ్‌మన్ గిల్ విరాట్ కోహ్లీలా ఒక బ్రాండ్‌గా మారే ప్రయత్నం చేయకుండా, అనవసరమైన దూకుడును వదిలి, తన బ్యాటింగ్, కెప్టెన్సీపై దృష్టి పెట్టాలి" అని చెప్పుకొచ్చాడు. గిల్ దూకుడు వైఖరి జట్టుకు వ్యతిరేకంగా పనిచేసిందని, ఆటగాళ్లు శాంతంగా ఆడాల్సిన సమయంలో ఇటువంటి వివాదాలు నష్టం కలిగిస్తాయని అన్నాడు.
మంజ్రేకర్ మాట్లాడుతూ "గిల్ ఒక అద్భుతమైన ఆటగాడు. కానీ కెప్టెన్‌గా అతడు ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. విరాట్ కోహ్లీ దూకుడు అతడి ఆటలో ఒక భాగం. అది అతనికి సహజంగా వచ్చింది. అతడు ఆ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే, శత్రువుల ముఖంలోకి చూసి సెంచరీ కొట్టి ఉండేవాడు. గిల్ ఈ సిరీస్‌లో 269 పరుగులు సహా మూడు సెంచరీలతో బ్రాడ్‌మన్‌లా ఆడాడు. అయితే, తాజా మ్యాచ్‌లో 9 బంతుల్లో 6 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ దూకుడు అతని సహజ శైలి కాదని స్పష్టం చేస్తుంది" అని మంజ్రేకర్ వివరించాడు.