Pahalgham Attack: పహల్గామ్ దాడి: బాడీకామ్ లు ధరించి నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదులు

Pahalgham Attack Terrorists seen with Bodycams while Brutal Massacre
  • పహల్గామ్ దాడిని బాడీక్యామ్‌లతో రికార్డు చేసిన ఉగ్రవాదులు
  • మతం నిర్ధారించుకుని హిందువులను లక్ష్యంగా చేసుకున్న వైనం
  • కల్మా చదవలేదని టెక్కీ బిటన్ అధికారి దారుణ హత్య.
  • ప్రాణాలతో బయటపడిన వారి భయానక అనుభవాల వెల్లడి.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దారుణ మారణకాండను ఉగ్రవాదులు తమ బాడీక్యామ్‌లలో రికార్డు చేశారని ప్రాణాలతో బయటపడిన వారు చెబుతున్నారు. బాధితులు తమ భయానక అనుభవాలను పంచుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఫ్లోరిడాకు చెందిన టెక్కీ బిటన్ అధికారి (40) భార్య సోహిని (37), తన భర్త మరణం నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. జరిగిన ఘోరాన్ని వివరిస్తూ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "ఆ భయానక క్షణాలను నా జ్ఞాపకాల నుంచి చెరిపేసుకోలేకపోతున్నాను. నా భర్తను కాల్చి చంపిన ఉగ్రవాది నుదుటికి ఓ వీడియో కెమెరా కట్టుకుని ఉన్నాడు. అంటే వారు ఆ దారుణాలను రికార్డు చేస్తున్నారు లేదా ఎవరికో లైవ్ స్ట్రీమింగ్ చేసి ఉండొచ్చు" అని ఆమె తెలిపారు. బిటన్‌ను తుపాకీతో బెదిరించి మతం చెప్పమని అడిగారని, అతను మౌనంగా ఉండటంతో మొదటి కల్మా చదవమని ఆదేశించారని సోహిని చెప్పారు. తాను హిందువునని, కల్మా చదవడం రాదని బిటన్ చెప్పడంతోనే ఉగ్రవాదులు అతన్ని కాల్చి చంపారని ఆమె కన్నీటితో వివరించారు.

బైసరన్ వ్యాలీలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటూ సోహిని, "మేమంతా లోయలో ఆనందంగా గడుపుతున్నాం. ఇంతలో కొందరు వ్యక్తులు మా వద్దకు వచ్చి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. ఉన్నట్టుండి తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. అందరం భయంతో కిందకు వంగిపోయాం. ఉగ్రవాదులు మా దగ్గరకు వచ్చి మా గుర్తింపు వివరాలు అడిగారు. ఓ వృద్ధుడు మౌనంగా ఉండిపోయాడు. అతన్ని తలపై కాల్చి చంపారు" అని తెలిపారు. "మేం బతికి బయటపడ్డామని అనుకుంటున్న సమయంలోనే నా భర్తను కాల్చారు. అతను నేలపై కుప్పకూలిపోయాడు. మొదట స్పృహ తప్పి పడిపోయాడని, బ్రతికించవచ్చని అనుకున్నాను" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన 10 ఏళ్ల నక్ష్ కూడా ఉగ్రవాదులు తమ దాడులను బాడీక్యామ్‌లతో రికార్డు చేశారని వెల్లడించాడు. నక్ష్ తండ్రి, ముంబైలోని ఎస్‌బిఐ కాందీవలీ బ్రాంచ్‌లో బ్యాంకర్‌గా పనిచేస్తున్న శైలేష్ కలాథియా ఈ దాడిలో మరణించిన 26 మందిలో ఒకరు. నక్ష్, అతని సోదరి నీతి, తల్లి శీతల్ ఈ మారణహోమం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకుంటూ నక్ష్, "మేం ఆకలితో ఉండటంతో తినడానికి వెళ్లాం. ఉన్నట్టుండి కాల్పుల మోత వినిపించింది, అందరూ ప్రాణభయంతో పరుగులు తీశారు. ఉగ్రవాదులు కెమెరాలు అమర్చిన టోపీలు ధరించి ఉన్నారు" అని చెప్పాడు. 
Pahalgham Attack
Terrorist Attack
Jammu and Kashmir
Bodycams
Sohaini Biton
Terrorism
India
Kashmir
Travel Advisory
Killed Tourists

More Telugu News