'కాంచన 4'... ఈ సారి అంతకుమించి!
- 2011లో వచ్చిన 'కాంచన' సూపర్ హిట్
- 2015లో విడుదలైన 'కాంచన 2' బ్లాక్ బస్టర్ హిట్
- 120 కోట్ల వరకూ వసూలు చేసిన సినిమా ఇది
- 65 కోట్లతో నిర్మితమవుతున్న 'కాంచన 4'
'కాంచన' సిరీస్ లో లారెన్స్ కి అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిందిగా 'కాంచన 2' కనిపిస్తుంది. తాప్సి కథానాయికగా నటించిన ఈ సినిమాను లారెన్స్ 17 కోట్లతో నిర్మించగా, 120 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ప్రసారమయితే మంచి రేటింగ్ వస్తుంది. 'కాంచన 3' విషయానికి వస్తే వసూళ్లు పెద్దగా తగ్గలేదు గానీ, కంటెంట్ కాస్త వీక్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో లారెన్స్ కాస్త గ్యాప్ తీసుకుని 'కాంచన 4'ను రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నాడు.
'కాంచన 4' సినిమా కోసం లారెన్స్ 65 కోట్లను కేటాయించడం విశేషం. ఖర్చు పరంగానే కాదు, వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా తన కెరియర్ లోనే భారీ చిత్రంగా నిలిచిపోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఇక కంటెంట్ పరంగా కూడా గతంలో వచ్చిన మూడు భాగాలకు మించి అన్నట్టుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే 'బధిర' యువతిగా కనిపించనుందని అంటున్నారు. ఈ ఏడాది చివరిలోగానీ, వచ్చే ఏడాది ఆరంభంలో గాని ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.