కూతురు క్రాంతి భారతి విమర్శలపై స్పందించిన ముద్రగడ పద్మనాభం
- కూతురికి, నాకు మధ్య చిచ్చుపెట్టాలని చూశారన్న ముద్రగడ
- పెళ్లి అవ్వడంతో నా కూతురు నా ప్రాపర్టీ కాదని వ్యాఖ్య
- ఎవరి బెదిరింపులకూ భయపడనున్న వైసీపీ నేత
నా కూతురు నా ప్రాపర్టీ కాదు..
తనకు, తన కూతురికి మధ్య చిచ్చు పెట్టాలని చూశారని, కానీ తాను బెదిరిపోనని ముద్రగడ పద్మనాభం అన్నారు. ‘‘నా కూతురు నా ప్రాపర్టీ కాదు’’ అని ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. ఆమెకి పెళ్లి అవ్వకముందు తన ప్రాపర్టీ అని, వివాహం అవడంతో ఆమె అత్తగారి ప్రాపర్టీ అని అన్నారు. తన కూతురి వ్యాఖ్యలకు భయపడనని ముద్రగడ అన్నారు. తన కూతురితో వీడియో రిలీజ్ చేయించారని, ఎవరు బెదిరించినా తాను బెదిరిపోనని ముద్రగడ పద్మనాభం అన్నారు. తాను ఎప్పటికీ జగన్‌కి సేవకుడిగానే ఉంటానని అన్నారు.
తండ్రిపై క్రాంతి భారతి విమర్శలు
పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ముద్రగడ పద్మనాభం ప్రచారం చేస్తున్న వైఖరిని క్రాంతి భారతి తప్పుబట్టారు. కేవలం పవన్ కళ్యాణ్‌ని తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నారని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను జనసేన పార్టీ శుక్రవారం ఎక్స్ వేదికగా విడుదల చేసింది. ‘‘ పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత విజయం కోసం నా తండ్రి పనిచేయవచ్చు. కష్ట పడవచ్చు. అందులో తప్పు లేదు. కానీ జగన్ మెప్పు కోసం పవన్ కల్యాణ్ మీద వాడుతున్న భాష సరికాదు. ముద్రగడ తీరు మార్చుకోవాలి. ఎన్నికల సమయంలో ముద్రగడను సీఎం జగన్ వాడుతున్నారు. ఈ విషయం ముద్రగడ తెలుసుకుంటే మంచిది. పవన్ కల్యాణ్ గెలుపు కోసం నా వంతుగా కృషి చేస్తా’’ అని క్రాంతి భారతి ఆ వీడియోలో పేర్కొన్నారు.